‘సెప్సిస్‌’ను ముందుగానే గుర్తించే టెక్నాలజీ!

ప్రమాదకరమైన సెప్సిస్‌ను ముందుగానే పసిగట్టే మరో అధునాతన సాంకేతికతను ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు అభివృద్ధిచేశారు. వ్యక్తి శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌, రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించే పరిస్థితినే సెప్సిస్‌గా.....

Updated : 16 Oct 2020 04:19 IST

అభివృద్ధిచేసిన ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు

చెన్నై: ప్రమాదకరమైన సెప్సిస్‌ను ముందుగానే పసిగట్టే మరో అధునాతన సాంకేతికతను ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు అభివృద్ధిచేశారు. వ్యక్తి శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌, రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించే పరిస్థితినే సెప్సిస్‌గా వ్యవహరిస్తారు. ఎవరైనా వ్యక్తిలో ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు అతడి శరీరం తీవ్రంగా ప్రతిస్పందించడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య తీవ్రమైతే అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం ద్వారా వ్యక్తి ప్రాణాలను రక్షించే వీలుంటుంది. దీనిలో భాగంగానే చెన్నై పరిశోధకులు నూతన సాంకేతికతను అభివృద్ధిచేశారు.

‘మైక్రో ఫ్లూయిడ్‌ చిప్‌’ ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని ధ్వని తరంగాలు, కెమికల్‌ ప్రోబ్స్‌, మైక్రోఫ్లూయిడ్‌ మిక్సర్‌తోపాటు రియాక్టర్‌ సాయంతో రూపొందించారు. వీటికి అనుసంధానంగా ఉండే లేజర్‌ సాయంతో రక్తం (ప్లాస్మా)లో ఉండే అణువుల స్థాయిలను అంచనా వేస్తుంది. ముఖ్యంగా గ్యాసోట్రాన్స్మిటర్లుగా పిలవబడే ప్లాస్మాలోని హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ల స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇలా బయోమేకర్లుగా పనిచేస్తూ సెప్సిస్‌ను ముందస్తుగా పసిగట్టి హెచ్చరిస్తుంది. కొందరు రోగుల్లో సర్జరీ సమయంలో ఒక్కోసారి ఇన్‌ఫ్లమేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో గ్యాసోట్రాన్స్మిటర్ల స్థాయిలను అంచనా వేయడం కూడా ఎంతో ముఖ్యం. ఈ నూతన పరిజ్ఞానం ద్వారా ఈ తరహా సమస్యను కూడా ముందే పసిగట్టవచ్చని ఈ పరికరాన్ని రూపొందించిన పరిశోధకులు స్పష్టంచేశారు.

ప్రస్తుతమున్న పరిజ్ఞానంతో సెప్సిస్‌ పరిస్థితిని నిర్ధారించేందుకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. దీనిలో రక్త పరీక్షలతోపాటు వైద్యసిబ్బంది ప్రమేయం కూడా కావాల్సి వస్తోంది. నిరంతరాయంగా పర్యవేక్షించే సాంకేతిక అందుబాటులో లేదు. వీటిని అధిగమించేందుకే ఇలాంటి నూతన పరిజ్ఞానాన్ని అభివృద్ధిచేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ పరికరం పేటెంట్‌ హక్కులకోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు పరిశోధన బృందం వెల్లడించింది. ఇప్పటికే జంతువులపై పరీక్షించిన ఈ సాంకేతికతను తయారుచేయడానికి కంపెనీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

కేవలం ఒక్క 2017 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5కోట్ల మందిలో సెప్సిన్‌ను గుర్తించారు. అంతేకాకుండా ఈ పరిస్థితి ఎదుర్కొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు మరణిస్తున్నట్లు  నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే, నిరంతర పర్యవేక్షణ, కృత్రిమ మేధ సాయంతో సెప్సిస్‌ తొలిదశలోనే గుర్తించే సాంకేతికత కోసం ముమ్మర కృషి జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని