అత్యవసర వినియోగ అనుమతికి మరో టీకా!

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందున్న మోడెర్నా, తాము రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం సిద్ధమైంది.

Published : 30 Nov 2020 18:56 IST

దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మోడెర్నా

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందున్న మోడెర్నా, తాము రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం సిద్ధమైంది. ఇప్పటికే తాము రూపొందించిన mRNA-1273 వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ నియంత్రణ సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా, రష్యా దేశాల వ్యాక్సిన్‌లు మినహా, అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకున్న రెండో వ్యాక్సిన్‌గా మోడెర్నా టీకా నిలిచింది.

మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ 94శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. అయితే, తొలి మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో భాగంగా కేవలం 95 కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. కానీ, ప్రస్తుతం 196 కేసులను విశ్లేషించిన అనంతరం వ్యాక్సిన్‌ సమర్థతను మరోసారి ప్రకటించింది. తాజా విశ్లేషణలో 185 మంది ప్లెసిబో తీసుకున్నవారు కాగా 11మంది మాత్రమే నిజమైన వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరిలోనూ వ్యాక్సిన్‌ 94.1శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు మోడెర్నా వెల్లడించింది. సురక్షిత, సమర్థతపై పూర్తి నమ్మకంతో ఉన్న మోడెర్నా, వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో స్వల్ప దుష్ప్రభావాలు మాత్రమే కనిపించినట్లు స్పష్టంచేసింది. ఇవి సాధారణంగా కనిపించేవేనని వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. అందుకే అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా, యూరోపియన్‌ నియంత్రణ సంస్థలకు నివేదిస్తున్నట్లు మోడెర్నా ప్రకటించింది.

డిసెంబర్‌ పదో తేదీపై ఉత్కంఠ...

కరోనా వ్యాక్సిన్‌ సంస్థలు అనుమతి కోసం తమను సంప్రదిస్తోన్న నేపథ్యంలో, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఎఫ్‌డీఏ సిద్ధమైంది. ఈ నెలలోనే వ్యాక్సిన్‌ సమర్థతపై శాస్త్రవేత్తల బృందం ప్రత్యేక సమీక్ష జరపనుంది. ఫైజర్‌ ఇప్పటికే అనుమతి కోరగా, డిసెంబర్‌ 10వ తేదీన నిపుణుల బృందం ముందుకు ఫైజర్‌ సమాచారం రానుంది. అప్పటినుంచి మరో వారంరోజుల అనంతరం (డిసెంబర్‌ 17వ తేదీన) మోడెర్నా వ్యాక్సిన్‌ సమర్థతపై శాస్త్రవేత్తల బృందం చర్చించనుంది. అయితే, ఇవి పూర్తైన తర్వాత కొన్ని రోజుల్లోనే అనుమతిపై ఎఫ్‌డీఏ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక నియంత్రణ సంస్థల అనుమతి అభించిన వెంటనే వ్యాక్సిన్‌ పంపిణీకి అటు ఫైజర్‌, మోడెర్నా సంస్థలు సిద్ధమవుతున్నాయి.

ఇదిలాఉంటే, క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా మోడెర్నా 30వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేపట్టింది. కేవలం 18 ఏళ్ల పైబడిన వారిలోనే ప్రయోగాలు జరిపింది. వీరిలో దాదాపు 7వేల మంది 65ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారే. అయితే, వృద్ధుల్లోనూ వ్యాక్సిన్‌ చక్కగా పనిచేస్తున్నట్లు ఇదివరకే వెల్లడైంది. వీరిలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు కూడా ఉండటం గమనార్హం. దీంతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి..
వృద్ధుల్లోనూ మెరుగైన ఫలితాలు!
టీకా నిల్వ: ఆ సమస్య ఉండదన్న మోడెర్నా!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని