కరోనా యోధులకు దేశం రుణపడి ఉంది

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా .......

Updated : 14 Aug 2020 20:22 IST

2020 ఎన్నో పాఠాలు నేర్పిందన్న రాష్ట్రపతి

దిల్లీ: కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా విజృంభణతో ప్రజల జీవన స్థితిగతులే మారిపోయాయని, ఈ వైరస్‌ పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాతో నెలకొన్న కష్టకాలంలో కేంద్రం అనేక పథకాల ద్వారా సాయం చేసిందన్నారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు దేశం రుణపడి ఉందన్నారు. వీరంతా తమ పరిమితి కంటే ఎక్కువగా పనిచేస్తూ ఎంతోమంది ప్రాణాల్ని కాపాడుతున్నారన్నారు. అత్యవసర సేవలందిస్తున్నారని కొనియాడారు. కరోనాతో దేశంలో అన్ని కార్యకలాపాలకు పెద్ద ఆటంకం కలగడమే కాకుండా తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. వందేభారత్‌ కార్యక్రమం ద్వారా 10లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని చెప్పారు.

2020 ఎన్నో పాఠాలు నేర్పింది
2020లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, ప్రజారోగ్య వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కరోనా వేళ ఇంటి నుంచి పని, ఈ-లెర్నింగ్‌ బాగా పెరిగాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానమై జీవించడం నేర్చుకోవాలని సూచించారు. అయోధ్యపై సుప్రీం తీర్పును దేశ ప్రజలంతా స్వాగతించారని, మందిర నిర్మాణం కూడా ప్రారంభమైందని గుర్తుచేశారు.

గల్వాన్‌లో అమర జవాన్లకు సెల్యూట్‌
భారత్‌ - చైనా సరిహద్దులోని లద్దాఖ్‌లో గల్వాన్ లోయ వద్ద‌ చోటుచేసుకున్న ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులకు రాష్ట్రపతి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు సెల్యూట్‌ చేస్తున్నట్టు ప్రసంగంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని