
లాక్‌డౌన్ లేదు.. 57గంటల కర్ఫ్యూ: రూపానీ
అహ్మదాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించబోమని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్పష్టంచేశారు. అకస్మాత్తుగా కేసులు పెరుగుతుండటంతో అహ్మదాబాద్ నగరంలో ఈ రోజు రాత్రి 9గంటల నుంచి సోమవారం ఉదయం వరకు (57గంటల పాటు) కర్ఫ్యూ విధించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించే అవకాశమే లేదన్నారు. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే శని, ఆదివారాల్లో వీకెండ్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
మందులు, పాల దుకాణాలకే అనుమతి
ఈ పూర్తిస్థాయి కర్ఫ్యూ కొనసాగుతున్న సమయంలో అహ్మదాబాద్ నగరంలో కేవలం పాల దుకాణాలు, మందుల దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అవకాశం కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, సోమవారం రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూని కొనసాగించనున్నట్టు నిన్ననే అధికారులు స్పష్టంచేశారు. గత కొన్ని నెలల తర్వాత తొలిసారి అహ్మదాబాద్‌లో గురువారం 230 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
మాస్క్‌లేకపోతే రూ.1000 జరిమానా
ఈ వీకెండ్ కర్ఫ్యూ నేపథ్యంలో నగరంలో దాదాపు 600 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఈ రోజురాత్రి నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో నిత్యావసర సరకుల కోసం మార్కెట్ల వద్ద జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. మరోవైపు మాస్క్‌లు ధరించని వారికి అధికారులు రూ.1000 చొప్పున జరిమానా విధించడంతో పాటు వారికి యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారిని కొవిడ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.