వారి మరణాలపై సమాచారం లేదు: కేంద్రం

కరోనావైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో చోటుచేసుకున్న వలసకార్మికుల మరణాలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని కేంద్రం సోమవారం వెల్లడించింది.

Published : 14 Sep 2020 23:13 IST

పార్లమెంటులో కేంద్రం సమాధానం


దిల్లీ: కరోనావైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో చోటు చేసుకున్న వలస కార్మికుల మరణాలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని కేంద్రం సోమవారం వెల్లడించింది.  ఆ సమాచారం లేనందున పరిహారం అందించే అవకాశం కూడా లేదని తెలిపింది. వైరస్‌కు ప్రారంభ దశలోనే అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు  కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆ  సమాధానమిచ్చింది. 

అలాగే లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎదురైన సమస్యలను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందన్న విమర్శపై మరో కేంద్ర మంత్రి సంతోశ్‌ కుమార్‌ గంగ్వార్‌ స్పందించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఎన్‌జీఓలు, స్వయం సహాయ బృందాలు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కొవిడ్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ సమయంలో కలిసికట్టుగా పోరాటం చేశారన్నారు. 

కాగా, కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 1.04 కోట్ల మంది కార్మికులు లాక్‌డౌన్‌ సమయంలో వారి సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో కొందరు రోడ్డు మార్గంలో, రైళ్ల పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తూ..ప్రమాదాల బారిన పడి మరణించారు. దాంతో కేంద్రం వారిని తరలించడానికి ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని