15 మందిలో ఒకరికి కరోనా: ఐసీఎంఆర్‌

భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే నివేదికలోని కీలక విషయాల్ని వెల్లడించింది. దేశంలో 2020 ఆగస్టు నాటికి ప్రతి 15 మందిలో ఒకరు(పదేళ్ల పైన ఉన్నవారు) కరోనా బారిన పడినట్లు సర్వే నివేదిక అంచనా వేసినట్లు తెలిపింది.

Published : 29 Sep 2020 19:46 IST

దిల్లీ: భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే నివేదికలోని కీలక విషయాల్ని వెల్లడించింది. దేశంలో 2020 ఆగస్టు నాటికి ప్రతి 15 మందిలో ఒకరు(పదేళ్ల పైన ఉన్నవారు) కరోనా బారిన పడినట్లు సర్వే నివేదిక అంచనా వేసినట్లు తెలిపింది. దాదాపు 29వేల మందిపై సర్వే నిర్వహించగా 6.6శాతం మంది గతంలో కరోనా బారిన పడినట్లు తేలిందని ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

భార్గవ మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కరోనా వైరస్‌ కేసులు ఎక్కువగా నగరాల్లోని మురికివాడలు, సహా ఇతర ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక నగరాల్లోని ధనిక ప్రాంతాలతో పోల్చుకుంటే మురికివాడల్లో కేసుల తీవ్రత రెండు రెట్లు ఎక్కువగా ఉంది. వయోజనుల్లో 7.1శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడినట్లు సెరో సర్వే అంచనా వేస్తోంది. మే నెలలో కన్నా ఆగస్టులో కేసుల సంఖ్య తగ్గింది. దీన్ని బట్టి పరీక్షలు, డిటెక్షన్ల సంఖ్య పెరిగిందనే విషయం స్పష్టమవుతోంది’ అని ఆయన వెల్లడించారు. 

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో పండగలు, శీతాకాలం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు కంటైన్‌మెంట్‌ పద్ధతుల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేశంలో రికవరీ కేసుల సంఖ్య 51లక్షలు దాటింది. ప్రపంచంలోనే రికవరీల్లో ఇది అత్యధికం. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యల్పంగా దేశంలో మిలియన్‌ జనాభాకు 4వేల మంది కరోనా బారిన పడుతుండగా.. 70 మంది మరణిస్తున్నారు. అదేవిధంగా మిలియన్‌ జనాభాకు దాదాపు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్నాం. సెప్టెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 2.97 కోట్ల టెస్టులు చేశాం. ఆగస్టు 3 నుంచి ఇప్పటివరకు కరోనా మరణాలు గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 96వేలు దాటింది’ అని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని