పీఎం కేర్స్‌: 5రోజుల్లో రూ.3వేల కోట్లు..!

నిధి ప్రారంభమైన ఐదురోజుల్లోనే రూ.3076 కోట్లు జమ అయ్యాయి. మార్చి 27వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ మొత్తం(రూ.30,76,62,58,096) చేకూరినట్లు తాజాగా ఆడిట్‌ నివేదిక స్పష్టం చేసింది.

Published : 02 Sep 2020 16:10 IST

స్పష్టం చేసిన ఆడిటర్ల నివేదిక
దాతల పేర్లు ఎందుకు వెల్లడించడం లేదన్న చిదంబరం

దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా మోదీ ప్రభుత్వం మార్చి నెలలో పీఎం కేర్స్‌ నిధిని ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలనుకునేవారు ఈ నిధికి విరాళాలు అందించవచ్చని పేర్కొంది. ఈ నిధి ప్రారంభమైన ఐదురోజుల్లోనే రూ.3076 కోట్లు జమ అయ్యాయి. మార్చి 27వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ మొత్తం(రూ.30,76,62,58,096) చేకూరినట్లు తాజాగా ఆడిట్‌ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను పీఎం కేర్స్‌ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. అయితే మార్చి 31తర్వాత వచ్చిన విరాళాల గురించి ఇందులో ప్రస్తావించలేదు.

ఈ ప్రత్యేక నిధిని రూ.2,25,000ల కార్పస్‌ ఫండ్‌తో మార్చి 27న ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు పీఎం కేర్స్‌ నిధికి భారీగా విరాళాలు వచ్చాయి. కేవలం భారత్‌నుంచి కాకుండా విదేశాల నుంచి విరాళాలు ఇచ్చేందుకు పీఎం కేర్స్‌ వెసులుబాటు కల్పించింది. అయితే, దీనిపై తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. దాతల పేర్లు బహిర్గతం చేయడానికి ట్రస్టీలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని