మోదీ: ఒకేరోజు 3నగరాల్లో టీకా కేంద్రాల పరిశీలన!

దేశంలో ఉత్పత్తి అవుతోన్న కరోనా వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలను పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సిద్ధమయ్యారు.

Published : 27 Nov 2020 19:02 IST

దిల్లీ: దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలను పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. దేశంలోని మూడు ప్రధాన నగరాలైన అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, పుణె నగరాల్లోని వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలను శనివారం ఒకేరోజు మోదీ సందర్శించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పర్యటనలో భాగంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ ప్రక్రియను ప్రధాని మోదీ అక్కడి నిపుణులతో కలిసి సమీక్షిస్తారు. వ్యాక్సిన్‌ తయరీ కేంద్రాలను పరిశీలించడమే కాకుండా, టీకా పంపిణీకి ఎదురయ్యే సవాళ్ల గురించి అక్కడి శాస్త్రవేత్తలతో ప్రధాని చర్చించే అవకాశం ఉంది. తద్వారా దేశవ్యాప్తంగా కోట్ల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేయడంలో తాజా పర్యటన దోహదపడుతుందని ప్రధాని కార్యాలయం అభిప్రాయపడింది.

ప్రపంచవ్యాప్తంగా తుదిదశ ప్రయోగాలు పూర్తిచేరుకుంటున్న కరోనా వ్యాక్సిన్‌, వినియోగానికి కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారత్‌లోనూ వ్యాక్సిన్‌ ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇక మనదేశంతో పాటు వివిధ దేశాల్లో కోట్ల మందికి కావాల్సిన వ్యాక్సిన్‌ అందించేందుకు భారత్‌లోనే భారీస్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది. ఇందుకోసం స్పుత్నిక్‌-వి, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వంటి వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థలు భారత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆయా వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలను సందర్శించి పురోగతిపై సమీక్షించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని