రామమందిరం భూమిపూజకు 150 మంది అతిథులు

అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు. అయితే కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా..

Published : 22 Jul 2020 19:10 IST

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం

దిల్లీ: అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు. అయితే కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా భౌతిక దూరం పాటించేందుకు ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపింది. ‘150 మంది అతిథులు సహా 200 మందికి మించి భూమిపూజలో పాల్గొనకూడదని నిర్ణయించాం’ అని ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌గిరి బుధవారం వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూమిపూజకు ముందు ప్రధాని మోదీ మందిరంలోని రాముడికి పూజ చేయనున్నారు. హనుమాన్‌ గిరి ఆలయంలోని హనుమంతుని పూజలోనూ పాలుపంచుకోనున్నారు. 

రామమందిరం ఉద్యమంతో ముడిపడిఉన్న ప్రముఖులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కతియార్‌లకు ఆహ్వానం పంపనున్నట్లు గతంలో ట్రస్టు అధికారి ఒకరు తెలిపారు. కాగా వారి రాకపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ను ఆహ్వానిస్తున్నట్లు మరో అధికారి వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని