కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు

కర్ణాటకలోని డి.జె.హళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అల్లుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు విషయంలో చెలరేగిన వివాదం..

Updated : 12 Aug 2020 15:36 IST

పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి

డి.జె.హళ్లి: కర్ణాటకలోని డి.జె.హళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అల్లుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ ఆందోళకారులు ఆగ్రహంతో శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు డి.జే.హళ్లి ఠాణాపై రాళ్ల దాడి చేశారు. శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్‌ ఎదుట ఉన్న వాహనాలను తగులబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 60 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులో దాడిలో ఏసీపీ ఫాతిమా చేయి విరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జి సహా, భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు నిరసన కారులు మృత్యువాత పడ్డారు. నిరసనకారులు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 147 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు సీపీ వెల్లడించారు. సామాజిక మాధ్యమంలో వివాదాస్పద పోస్టు పెట్టిన ఎమ్మెల్యే అల్లుడు నవీన్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఉద్రిక్తతల నేపథ్యంలో డి.జె.హళ్లి, కె.జె.హళ్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీపీ కమల్‌ పంత్‌ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు.

అల్లర్ల వెనుక ఎస్‌డీపీఐ హస్తం..

అల్లర్ల వెనుక సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌డీపీఐ నేత ముజామ్మిల్‌ బాషాను ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈనెల 5 నుంచే కుట్రకు ప్రణాళిక వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆందోళనకారుల్లో కొంతమంది గంజాయి మత్తులో ఉన్నట్టు గుర్తించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని