ర్యాపిడ్‌ టెస్ట్‌: 18నిమిషాల్లోనే ఫలితం!

నూతన టెక్నాలజీతో అధికసంఖ్యలో వేగంగా, కచ్చితఫలితమిచ్చే మరో సాంకేతికతను స్విస్‌ ఫార్మా కంపెనీ తయారుచేస్తోంది. వీటి ద్వారా గంటకు 300శాంపిళ్లను విశ్లేషించడం సాధ్యమని ప్రకటించింది.

Published : 13 Oct 2020 19:10 IST

గంటకు 300శాంపిళ్లను విశ్లేషించే నూతన టెక్నాలజీ

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ ఔషధాలు, వ్యాక్సిన్‌తోపాటు కొవిడ్‌ టెస్టులను వేగంగా చేసే సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఆర్‌టీపీసీఆర్‌తో పాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ ర్యాపిడ్‌ పరీక్షల కచ్చితత్వంలో తేడాలుంటున్నాయి. వీటిని అధిగమిస్తూ నూతన టెక్నాలజీతో అధికసంఖ్యలో వేగంగా, కచ్చితఫలితమిచ్చే మరో సాంకేతికతను స్విస్‌ ఫార్మా కంపెనీ తయారుచేస్తోంది. వీటి ద్వారా గంటకు 300శాంపిళ్లను విశ్లేషించడం సాధ్యమని ప్రకటించింది.

కరోనా వైరస్‌ను అధికమొత్తంలో, వేగవంతంగా గుర్తించే నూతన యాంటీజెన్‌ టెస్టును రూపొందిస్తున్నట్లు స్విస్‌ ఫార్మాదిగ్గజం రోచె ప్రకటించింది. ఈ సంవత్సరం చివరినాటికి ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలిక్సిస్‌(Elecsys)యాంటీజెన్‌ పేరుతో రూపొందిస్తోన్న ఈ పరిజ్ఞానంతో కేవలం 18నిమిషాల్లోనే కొవిడ్‌ ఫలితం వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా కొవిడ్‌ వైరస్‌ను విశ్లేషించేందుకు ఇప్పటికే ల్యాబ్‌లలో వినియోగిస్తోన్న కోబాస్‌ పరికరంతో సాయంతోనే అత్యంత కచ్చితత్వంలో ఫలితాన్ని విశ్లేషించవచ్చని తెలిపింది. ఇలాంటి ఒక యంత్రం గంటకు 300టెస్టులను విశ్లేషించే సామర్థ్యం ఉందని పేర్కొంది. ‘వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా, ఎవరికయినా వైరస్‌ సోకిందో? లేదో అనే విషయాన్ని సాధ్యమైనంత తొందరగా, కచ్చితంగా గుర్తించగలగడమే ఎంతో కీలకం. ఇందులో భాగంగానే ఈ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాం’ అని రోచె డయాగ్నస్టిక్స్‌ విభాగాధిపతి థామస్‌ షినెక్కర్‌ ప్రకటించారు.

ఇదిలాఉంటే, కొవిడ్‌ టెస్టుల్లో గోల్డెన్‌ టెస్టుగా భావించే ఆర్‌టీ-పీసీఆర్‌తో పోలిస్తే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల్లో వచ్చే ఫలితం కచ్చితత్వం తక్కువగా ఉంటోందని ఇప్పటికే అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు పేర్కొన్నాయి. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో నెగటివ్‌ వస్తే మళ్లీ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేయించాలని స్పష్టంచేస్తున్నాయి. అందుకే, వీటిని వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మాత్రమే వాడాలని సూచిస్తున్నాయి. అయితే, ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకోవడంతోపాటు సమయం కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించి వేగంగా, కచ్చితమైన కొవిడ్‌ ఫలితం ఇచ్చే సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని