రష్యా విపక్షనేతపై విష ప్రయోగం?

రష్యాలో అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సే నావల్నీ(44) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

Published : 20 Aug 2020 15:00 IST

కోమాలో రష్యా అవినీతి వ్యతిరేక ఉద్యమనేత అలెక్సే నావల్నీ

మాస్కో: రష్యాలో అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సే నావల్నీ(44) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సైబీరియా నుంచి మాస్కోకు తిరిగి వస్తున్న సమయంలో విమానంలోనే అలెక్సే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని ఓమ్‌స్క్‌ నగరంలో అత్యవసర ల్యాండింగ్‌ చేసిన అనంతరం ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నావల్నీ ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు అతని మీడియా కార్యదర్శి కిరా యార్మిష్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

‘అలెక్సే నావల్నీకు తేనీరులో విషం కలిపినట్లు అనుమానిస్తున్నాం. ఉదయం నుంచి అతను అదొక్కటే సేవించారు. వేడి పదార్థంతో విషం శరీరంలోకి వెళ్లడంతో అది మరింత తొందరగా ప్రభావం చూపిందని వైద్యులు పేర్కొన్నారు’ అని మీడియా కార్యదర్శి కిరా యార్మిష్‌ పేర్కొన్నారు. అలెక్సేపై గతంలోనూ ఇది తరహా విషప్రయోగం జరిగినట్లు యార్మిష్‌ గుర్తుచేశారు. యాంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌తోపాటు ‘రష్యా ఆఫ్ ది ఫ్యూచర్’‌ పార్టీ నేతగా ఉన్న నావల్నీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెడుతున్నారు. వీటితోపాటు పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయన గతంలో అధ్యక్షుడిపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో అతడు పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. అయితే అతనిపై పెట్టిన కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని తేలడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకుండా అలెక్సేపై పలుసార్లు భౌతిక దాడులు కూడా జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని