ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు దరఖాస్తు

 ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడేందుకు అన్ని దేశాలూ వ్యాక్సిన్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి.........

Published : 26 Jul 2020 02:52 IST

దిల్లీ:  ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడేందుకు అన్ని దేశాలూ వ్యాక్సిన్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. దానికోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ రెండు, మూడు దశల హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) డీసీజీఐ అనుమతి కోరింది. ఈ మేరకు పుణెకు చెందిన ఎస్‌ఐఐ కొవిడ్‌ షీల్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు అనుమతి కోరుతూ డీసీజీఐకి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వాఖ వర్గాలు తెలిపాయి. భద్రత, రోగనిరోధక శక్తిని గుర్తించేందుకు  వయోజనులపై అధ్యయనం చేయనుననట్టు ఎస్‌ఐఐ తన దరఖాస్తులో పేర్కొన్నట్టు సమాచారం.

ఈ  ట్రయల్స్‌ కోసం 18 ఏళ్లు పైబడిన 1600 మంది ఎన్‌రోల్‌ చేసుకున్నట్టు తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ తొలి రెండు దశల ట్రయల్స్‌ బ్రిటన్‌లోని ఐదు ప్రాంతాల్లో నిర్వహించగా సత్ఫలితాలు ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌  100 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు ఎస్‌ఐఐ బ్రిటన్‌కు చెందిన ఫార్మా కంపెనీ అస్త్ర జెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ సహా ప్రపంచంలోని మధ్య, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో అందుబాటులోకి తేనున్న ఈ వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ను వచ్చే నెలలో జరపాలని భావిస్తున్నట్టు ఎస్‌ఐఐ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని