భారత్‌: ఒక్కరోజే 8లక్షల కొవిడ్‌ టెస్టులు!

భారత్‌లో నిన్న ఒక్కరోజే 8,30,391శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది.

Published : 13 Aug 2020 17:35 IST

రికార్డుస్థాయిలో ఒకేరోజు 56వేల మంది రికవరీ
70.77శాతానికి పెరిగిన రికవరీ రేటు, 1.96శాతం మరణాలు రేటు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 8,30,391శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 2కోట్ల 68లక్షల(2,68,45,688) శాంపిళ్లకు పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 1433 కేంద్రాలకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. వీటిలో 947 ప్రభుత్వం ఆధీనంలోనివి కాగా మరో 486 కేంద్రాలు ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. జనవరి 23వరకు దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్‌ కేంద్రం ఉండగా మార్చి 23వరకు ఆ సంఖ్య 160కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల సంఖ్య 1433కు పెరిగింది. ప్రపంచంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్‌ నిలుస్తోంది. అమెరికాలో ఇప్పటివరకు 6కోట్లకు పైగా ప్రజలకు కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు.

ఒకేరోజు 56వేల మంది రికవరీ..
భారత్‌లో వైరస్ తీవత్ర కొనసాగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 56,383 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా బాధితుల రికవరీ రేటు 70.77శాతానికి పెరగ్గా మరణాల రేటు 1.96శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 23లక్షల మందికి వైరస్‌ సోకగా వీరిలో 17లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 27.27శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే రోజువారీ పాజిటివ్‌ కేసులు అధికంగా ఉంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని