​​​​​​ప్రణబ్ కృషితో అంతర్జాతీయ శక్తిగా భారత్‌

భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్‌ను గొప్ప నేతగా అభివర్ణించిన ఆయన కుటుంబ సభ్యులకు, దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు........

Updated : 02 Sep 2020 09:47 IST

ఆయన మృతి పట్ల ట్రంప్‌, పాంపియో విచారం

వాషింగ్టన్‌: భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్‌ను గొప్ప నేతగా అభివర్ణించిన ఆయన కుటుంబ సభ్యులకు, దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సైతం ప్రణబ్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా నిలపడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. దాదాపు అర్ధశతాబ్దం పాటు పార్లమెంటేరియన్‌గా, మంత్రిగా, రాష్ట్రపతిగా ప్రజల కోసం పనిచేయడం గొప్ప విషయమంటూ ప్రణబ్‌ సేవల్ని గుర్తుచేశారు. ఆయన దార్శనికత వల్ల భారత్‌-అమెరికా మధ్య బలమైన సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఆయన విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన పౌర అణు ఒప్పందం సహా ఇతర కీలక ఒప్పందాల వల్ల భారత్‌ రక్షణపరంగా బలంగా తయారైందని వివరించారు.

దిల్లీలోని లోధీ రోడ్‌ విద్యుత్తు దహనవాటికలో మంగళవారం మధ్యాహ్నం ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల నడుమ పూర్తైన విషయం తెలిసిందే. 21 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం సైనిక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన ప్రణబ్‌ భౌతిక కాయాన్ని సందర్శించడానికి అధికార, అనధికార ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆయన నివాసానికి తరలివచ్చారు. కొవిడ్‌-19 ఆంక్షలను పాటిస్తూనే వారంతా మహానేతను కడసారిగా సందర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని