Published : 19 Jul 2020 16:31 IST

బ్రిటన్‌: లక్షల్లో యాంటీబాడీ టెస్టులకు సిద్ధం!

20 నిమిషాల్లోనే 98.6శాతం కచ్చితమైన ఫలితం
ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తల తాజా ప్రయోగం సఫలం!

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ధాటికి బ్రిటన్‌ వణికిపోయింది. ఈ సమయంలో దేశంలో వైరస్‌ సంక్రమణ స్థాయిని తెలుసుకునేందుకు భారీసంఖ్యలో యాంటీబాడీ పరీక్షలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా యూకే-ఆర్‌టీసీ జరిపిన ప్రయోగాల్లో యాంటీబాడీ పరీక్షా ఫలితాలు అత్యంత కచ్చితంగా వస్తున్నాయని తేలింది. యూకే-ఆర్‌టీసీ అభివృద్ధి చేసిన తాజా పద్ధతి ద్వారా లక్షల సంఖ్యలో ప్రజలకు ఉచితంగా యాంటీబాడీ పరీక్షలు నిర్వహించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా యాంటీబాడీ పరీక్షలను నిర్వహించాలని యోచించిన నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ప్రముఖ డయాగ్నస్టిక్స్ కంపెనీలతో కలిసి యూకే రాపిడ్‌ టెస్ట్‌ కన్సార్టియం(యూకే-ఆర్‌టీసీ)గా ఏర్పడింది. ప్రస్తుతం యాంటీబాడీ పరీక్ష కోసం రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం లేబొరేటరీకి పంపిస్తున్నారు. ఈ పద్ధతిలో ఫలితం రావడానికి కొన్నిరోజుల సమయం పడుతుంది. దీన్ని అధిగమించేందుకు యూకే-ఆర్‌టీసీ నిమిషాల్లోనే ఫలితం వచ్చే వినూత్న పద్ధతిని రూపొందించింది. దీంతో ఏవరైనా వ్యక్తి గతంలో కరోనా వైరస్‌ బారినపడ్డారా? లేదా? అనే విషయం కేవలం 20నిమిషాల్లోనే తేలిపోతుంది. చేతి వేళ్లనుంచి రక్తాన్ని సేకరించి పరీక్షించే ఈ పద్ధతిలో 98.6శాతం కచ్చితత్వంతో ఫలితం ఉంటున్నట్లు మానవ ప్రయోగాల్లో తేలినట్లు సమాచారం.

బ్రిటన్‌ నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించగానే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన పరికరాన్ని భారీ ఎత్తున తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాయని తెలిపాయి. ఈ సంవత్సరం చివరినాటికి లక్షల మంది పరీక్షించుకునేందుకు వీటిని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వీటిని ప్రజలకు ఉచితంగా అందజేయనున్నారు. అయితే, దీన్ని కేవలం ఆన్‌లైన్‌లోనే ఆర్డరు చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఈ యాంటీబాడీ పరీక్ష ద్వారా వ్యక్తి ఇదివరకు కొవిడ్‌ బారినపడ్డారా? లేదా? అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్‌ సంక్రమణ ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆరోగ్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ యాంటీబాడీల వల్ల మరోసారి వైరస్‌ సోకితే తట్టుకునే రోగనిరోధక శక్తి వస్తుందో లేదో అనే విషయంపై మాత్రం స్పష్టత లేదని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి..
అగ్రదేశాల టీకా యుద్ధం!
మిస్టరీ: నడిసంద్రంలో కరోనా?

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని