సుశాంత్‌ మృతిని మర్చిపోం: దేవేంద్ర ఫడణవీస్‌

బిహార్‌లో ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. పార్టీలు పకడ్బందీగా..

Published : 12 Sep 2020 14:43 IST

పాట్న: బిహార్‌లో ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది. అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాగా భాజపా నేతలు రాష్ట్రంలో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్‌ తప్పుబడుతోంది. నటుడి మృతిని రాజకీయం చేస్తూ, లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తోంది. కొద్ది రోజులుగా భాజపా తరఫున బిహార్‌లో ప్రచారం చేస్తున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కాంగ్రెస్‌ ఆరోపణలను ఖండించారు. సుశాంత్‌ మృతి ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, అతడికి న్యాయం జరిగేంతవరకూ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘సుశాంత్‌ మరణాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. సుశాంత్‌ మరణం కంటే ముందు నుంచే బిహార్‌లో పార్టీ కోసం పనిచేస్తున్నా. నటుడి మృతి సామాన్య ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది. అతడికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతూనే ఉంటాం. ఆ ఘనటను మేం మర్చిపోం. ఇంకెవ్వరినీ మర్చిపోనివ్వం’ అని అన్నారు. 

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఈడీ), నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)లు దర్యాప్తు చేస్తున్నాయి. కాగా నటుడికి మాదకద్రవ్యాలు సరఫరా చేశారంటూ నటి, సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు పలువురిని అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని