
Abhinandan Varthaman: ‘వీర్‌చక్ర’ అందుకున్న అభినందన్ వర్ధమాన్
దిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్యసాహసాలు చూపిన వింగ్ కమాండర్(ఇప్పుడు గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్ధమాన్‌ను కేంద్ర ప్రభుత్వం ‘వీర్ చక్ర’ పురస్కారంతో సత్కరించింది. ఆనాడు పాక్ వైమానిక దళంతో వీరోచితంగా పోరాడి ఆ దేశానికి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చేసినందుకుగానూ అభినందన్‌కు 2019లో కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం జరిగిన గ్యాలెంటరీ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అభినందన్ వీర్ చక్ర అవార్డును అందుకున్నారు.
రాష్ట్రపతి భవన్‌లో గ్యాలెంటరీ అవార్డుల పురస్కారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు చూపిన, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పలువురు వీర జవాన్లకు రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు. 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్‌కు మరణానంతరం ‘శౌర్య చక్ర’ పురస్కారం ప్రకటించగా.. ఆయన తల్లి సరోజ్ దౌండియాల్, సతీమణి నితికా కౌల్ ఈ అవార్డును స్వీకరించారు. కాగా.. నితికా కౌల్ ఇటీవలే లెఫ్టినెంట్‌గా సైన్యంలో చేరిన సంగతి తెలిసిందే.
జమ్మూకశ్మీర్‌లో ఏ++ కేటగిరీ ఉగ్రవాదిని హతమార్చిన నాయిబ్ సుబేదార్ సోంబిర్‌కు కూడా మరణానంతరం శౌర్య చక్ర ప్రకటించగా.. ఆయన కుటుంబ సభ్యులు పురస్కారాన్ని అందుకున్నారు. ఇంజినీర్స్ ఆఫ్ కార్ప్స్‌కు చెందిన సాపర్ ప్రకాశ్ జాదవ్‌కు మరణానంతరం కీర్తి చక్ర ఇవ్వగా.. ఆయన భార్య, తల్లి అవార్డును స్వీకరించారు.
2019లో బాలాకోట్ ఘటన జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం ఎఫ్-16 విమానంతో భారత్‌పై దాడికి యత్నించగా.. వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్ మిగ్-21 విమానంతో వెంటాడి దాన్ని నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో కిందకు దూకగా అది పాక్ భూభాగంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని పాక్ జవాన్లు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. కాగా.. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. చికిత్స కోసం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అభినందన్ తిరిగి విధుల్లోకి చేరి దేశసేవను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే అభినందన్‌కు కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి కల్పిస్తూ భారత వైమానిక దళం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.