Sonu Sood: పంజాబ్‌లో సోనూ సూద్‌పై కేసు నమోదు..!

బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌పై పంజాబ్‌లోని మోగా జిల్లాలో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్‌ రోజున సోనూ ఆయన సోదరి తరఫున

Published : 22 Feb 2022 13:06 IST

చండీగఢ్‌: బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌పై పంజాబ్‌లోని మోగా జిల్లాలో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్‌ రోజున సోనూ ఆయన సోదరి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారన్న ఆరోపణలపై పోలీసులు ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేశారు. 

గత ఆదివారం పంజాబ్‌ అసెంబ్లీ పోలింగ్‌ జరిగింది. సోనూ సూద్‌ సోదరి మాళవిక సూద్‌ మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలోని లండేకే గ్రామంలో సోనూ పోలింగ్‌ రోజున తన సోదరి తరఫున ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా.. సోనూ సూద్‌ కారులో కూర్చుని ప్రచారం చేసినట్లు గుర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు మోగా పోలీసులు తెలిపారు. 

అంతకుముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోనూసూద్‌పై ఈసీ ఆదివారం పలు ఆంక్షలు విధించింది. ఎన్నికల రోజున మోగాలోని పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లకుండా నిలువరించింది. ఆయన కారును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు సూద్‌ నివాసం ఎదుట వీడియో కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు.

అయితే ఈ ఆరోపణలను సోనూసూద్‌ ఖండించారు. ‘విపక్షాల నుంచి పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. కొన్ని కేంద్రాల్లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం వచ్చింది. ఆ విషయం తెలిసే ఇంటి నుంచి బయటకు వచ్చాను’ అని సోనూ సూద్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని