ఆందోళన వద్దు.. తగినంత ఆక్సిజన్‌ ఉంది!

కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ..దేశంలో తగినంత ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది.

Published : 29 Apr 2021 22:57 IST

మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. దేశంలో తగినంత ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆక్సిజన్‌ సరఫరాను పెంచడానికి అన్ని మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని పేర్కొంది. దేశంలోని వివిధ పరిశ్రమలతో పాటు విదేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లు, క్రయోజెనిక్‌ ట్యాంకులను సమకూరుస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అనవసర భయాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

‘ఆక్సిజన్‌కు సంబంధించి సరైన సమచారం అందించడం ఎంతో కీలకం. భయంతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీయకండి. కేవలం ఎవరికైతే ఆక్సిజన్‌ అవసరమవుతుందో వారికి తప్పకుండా ఇవ్వాల్సిందే. కానీ, సరైన అవగాహన లేకుండా ఆక్సిజన్‌ అవసరం అవుతుందని స్వతహాగా అనుకోవడం సరికాదు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ బారినపడిన వారిలో ఎక్కువ మంది ఇంటివద్ద కోలుకుంటారని.. కేవలం ఆరోగ్యశాఖ మంత్రిగానే కాకుండా ఓ వైద్యుడిగా ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు.

16కోట్ల డోసులు ఉచితంగా పంపించాం: కేంద్రం

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు 16కోట్ల డోసులను ఉచితంగా పంపిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో అదనంగా మరో 20లక్షల డోసులను సరఫరా చేస్తామని తెలిపింది. ఇప్పటివరకు ఇలా 16.16కోట్ల(16,16,86,140) డోసులను ఉచితంగా అందించగా.. వీటిలో ఇప్పటివరకు 15కోట్ల 10లక్షల డోసులను(వృథా అయిన డోసులతో కలిపి) వినియోగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో దాదాపు కోటి డోసులు అందుబాటులో ఉన్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. దేశంలో జనవరి నెలలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని