AgustaWestland scam: వీవీఐపీ చాపర్ల కుంభకోణం.. రక్షణశాఖ మాజీ కార్యదర్శిపై ఛార్జ్‌షీట్‌

దేశంలో సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ చాపర్ల కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేడు మరో సప్లమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది

Published : 16 Mar 2022 19:01 IST

దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ చాపర్ల కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం మరో సప్లమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మతో పాటు భారత వాయుసేనకు చెందిన నలుగురు మాజీ అధికారుల పేర్లను ఈ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. వీరిని ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత సీబీఐ ఈ ఛార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. 

శశికాంత్‌ శర్మ 2011-13 మధ్య రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత 2013-17 వరకు కంట్రోల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా వ్యవహరించారు. శశికాంత్‌తో పాటు అప్పటి ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ జస్బీర్‌ సింగ్‌ పనేసర్‌, డిప్యూటీ చీఫ్‌ టెస్ట్‌ పైలట్‌ ఎస్‌ఏ కుంతే, అప్పటి వింగ్‌ కమాండర్‌ థామస్‌ మాథ్యూ, గ్రూప్‌ కెప్టెన్‌ ఎన్‌ సంతోష్‌లపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. 

వీవీఐపీ ప్రయాణానికి వినియోగించే హెలికాప్టర్‌ కోసం 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో చేసుకున్న ఒప్పందంలో పలువురికి భారీ ఎత్తున ముడుపులు దక్కాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఇది పెను దుమారం రేపింది. 1990ల్లో వీవీఐపీల ప్రయాణానికి ఏఐఎఫ్‌ సోవియెట్‌ కాలం నాటి ఎంఐ8లను వినియోగించేది. అయితే వీటికి బదులుగా కొత్త హెలికాప్టర్లను ఉపయోగించాలని 1999లో ప్రతిపాదనలు చేశారు. సాధారణంగా వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్ల ఆపరేషనల్‌ సీలింగ్‌ను 6వేల మీటర్లకు ఎయిర్‌ఫోర్స్‌ సెట్‌ చేసింది. అయితే ఎస్‌పీ త్యాగీ వాయుసేనాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సీలింగ్‌ను 4500 మీటర్లకు కుదించారు. దీంతో ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థ పోటీలోకి వచ్చేందుకు అవకాశం లభించినట్లయింది.

ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థే మధ్యవర్తులను ఉపయోగించి ఈ నిబంధనలను సడలించేలా చేసిందని, ఇందుకోసం త్యాగీ, ఆయన బంధువులకు భారీగా ముడుపులు అందాయని సీబీఐ దర్యాప్తులో తేలింది. దీంతో ఇప్పటికే త్యాగీ, మరో 11 మందిపై 2017లో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఆ తర్వాత 2020 సెప్టెంబరులో మధ్యవర్తి క్రిస్టియన్‌ మైఖెల్‌, మరికొందరిపై రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని