Amritpal Singh: భారత్‌పై అమృత్‌పాల్ విషకుట్ర ఇదీ..!
అమృత్‌పాల్ చరిత్ర మొత్తం భయానకంగా ఉంది. డ్రగ్ డీలర్లతో సంబంధాలు, డీఆడిక్షన్ కేంద్రాల్లో ప్రైవేటు సైన్యాలు, హంతకులతో సంబంధాలు బయటపడుతున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
అతడి పేరు అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh).. ఏడాది క్రితం వరకు అనామకుడు.. ఎవరో వెనుకుండి కథ నడిపినట్లు దాదాపు ఆరు నెలల్లో పాపులర్ అయ్యాడు. భారత్ నుంచి రాష్ట్రాన్ని విడదీయాలంటూ పాకిస్థాన్ భాషను మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుబాటులో ఉన్న అవకాశాలను.. అమాయక ప్రజల భావోద్వేగాలను వాడుకొంటూ ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు కుట్రపన్నాడు. అంతేకాదు.. సిక్కుల టాప్ సంస్థనే హైజాక్ చేయడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాడు.
ఎస్జీపీసీపై కన్ను..
సిక్కుల అత్యున్నత సంస్థ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ సిక్కులకు మినీ పార్లమెంట్ వంటిది. ఈ సంస్థ తాను అనుకొన్నట్లు సిక్కు చరిత్రను అన్వయించాలని అమృత్‌పాల్(Amritpal Singh) భావించాడు. అంతేకాదు తాను కోరుకొన్న అంశాలకే అది ప్రాధాన్యమిచ్చేలా చేయాలని చూశాడని సీనియర్ అధికారులు చెబుతున్నారు. అమృత్‌పాల్ మత ప్రచారం పేరిట సిక్కుల్లో తన హింసాత్మక భావజాలాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. గురుద్వారాల పవిత్రతను కూడా ఇతడు లెక్కచేయకుండా హింసాత్మకంగా వ్యవహరించాడు. అతడి అనుచరులు కపుర్తల, జలంధర్‌లలో రెండు గురుద్వారాలను కూడా ధ్వంసం చేశారు.
డ్రగ్స్‌ను అడ్డంపెట్టుకొని..
పంజాబ్‌లో మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువ. దీనిని అడ్డంపెట్టుకొని అమృత్‌పాల్ సింగ్ ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ పేరిట ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేశాడు. మాదకద్రవ్యాల డీఅడిక్షన్ కోసం అతడు తన పూర్వీకుల గ్రామంలో ఓ కేంద్రం ఏర్పాటు చేశాడు. గత నెల అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడి ఫుటేజీని చూస్తే ఈ డీఅడిక్షన్ కేంద్రంలోని చాలా మంది అందులో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. తాము వ్యసనాల నుంచి విముక్తి కోసం అక్కడ చేరినట్లు వెల్లడించారు. చాలా మంది అమృత్‌పాల్ డేరాలో సభ్యులమని అంగీకరించారు.
అమృత్‌పాల్ గన్‌మెన్ తేజిందర్ సింగ్ గిల్ ఫోన్ నుంచి ఖన్నా పోలీసులు కీలక వీడియోలను స్వాధీనం చేసుకొన్నారు. దీనిలో ఏకేఎఫ్ బృంద సభ్యులకు తుపాకుల వినియోగంపై శిక్షణ ఇస్తున్న క్లిప్‌లు ఉన్నాయి. అమృతపాల్ టైగర్ ఫోర్స్ పేరుతో మరో దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు, ఖలిస్థాన్ కరెన్సీ, మ్యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తేజిందర్ అరెస్టుతో బయటపడింది.
డీఅడిక్షన్ కేంద్రం ఓ నాటకం..
పంజాబ్‌ను అశాంతిలోకి నెట్టడానికి అతడి డీఅడిక్షన్ సెంటర్ ఓ నాటకమని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అమృత్‌సర్ డీఎస్పీ హరికిషన్ సింగ్ ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు. ఈ మత్తు బానిసలను ఏకేఎఫ్‌లోకి తీసుకెళ్లాలని అమృత్‌పాల్ కలలుగన్నాడని వెల్లడించారు. వాస్తవానికి డీఅడిక్షన్ కేంద్రంపై కూడా ఏకేఎఫ్ అని రాసి ఉంది. కేవలం వ్యసనపరులను ముగ్గులోకి లాగేందుకు ఇది ఒక బూటకపు కేంద్రమని హరికిషన్ తెలిపారు. అక్కడ చేరిన వారిని వెంటేసుకొని అమృత్‌పాల్ తిరిగాడని పేర్కొన్నారు. వారిలో చాలా మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరితోనే ఏకేఎఫ్ మొదలుపెట్టాడని చెప్పారు. ఆనందపూర్ ఖల్సా ఫెడరేషన్‌లో ఈ దళం ఓ భాగం మాత్రమే అని పేర్కొన్నారు.
మత్తు వ్యసనాలను వదిలించేందుకు తాను దిగివచ్చిన వ్యక్తిగా అమృత్‌పాల్ చిత్రీకరించుకొన్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ గ్రామంలో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం మనం ఎంత ఆనందంగా ఉన్నాం? మన యువత వ్యసనాలతో చనిపోతున్నారు. వారు చనిపోక ముందే అంత్యక్రియలు చేస్తున్నాం’’ అంటూ భావోద్వేగపూరితంగా ప్రసంగించాడు. కానీ, ఆయన డీఅడిక్షన్ సెంటర్‌లో మాత్రం ఎటువంటి వైద్యుడు లేడు. ఆ కేంద్రంలో చేరిన వారికి ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి బలవంతంగా ఐదు రోజులు వాడించేవారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నిస్తే తీవ్రంగా కొట్టేవారని అక్కడ ఉన్న రాజీందర్ అనే వ్యక్తి వెల్లడించాడు.
అమృత్‌పాల్ వచ్చాకే పెరిగిన పాక్ డ్రోన్ల కదలికలు..
అమృత్‌పాల్ వెనుక ఉన్న జశ్వంత్ సింగ్ రోడే.. పాకిస్థాన్ నుంచి భారత్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ డ్రగ్ డీఅడిక్షన్ కేంద్రాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అమృత్‌పాల్ భారత్ వచ్చాక పాక్ నుంచి డ్రోన్లతో డ్రగ్స్ సరఫరాలు పెరిగిపోయినట్లు తెలుస్తోంది. బీఎస్‌ఎఫ్ లెక్కల ప్రకారం 2021లో ఇటువంటి ఘటనలు 67 చోటు చేసుకోగా.. 2022లో ఏకంగా ఇవి 256కు చేరాయి. ఇవన్నీ అమృత్‌సర్, గుర్‌దాస్‌పూర్, ఫిరోజ్‌పూర్ ప్రాంతాల్లో చోటు చేసుకొన్నాయి. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్‌కు పాకిస్థాన్‌లోని బిలాల్, రాణా వంటి డ్రగ్ డీలర్లతో కూడా సంబంధాలు ఉండే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అమృత్‌పాల్ వెనుక ఉన్న మరో కీలక ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండా. ఇతడు పంజాబ్ నుంచి మహారాష్ట్ర వరకూ మాదక ద్రవ్యాల సామ్రాజ్యాన్ని విస్తరించాడు. దీంతోపాటు అమృత్‌పాల్‌కు మెర్సిడెస్ కారును ఇచ్చిన రవీల్‌సింగ్‌పై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి.
ఓ హత్యలో అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు..
హక్కుల కార్యకర్త సుధీర్ సూరి గతేడాది నవంబర్‌లో అమృత్‌సర్‌లో హత్యకు గురయ్యాడు. సూరి హంతకుడు కూడా అమృత్‌పాల్ అనుచరుడే. అతడి కారుపై ఏకేఎఫ్ స్టిక్కర్ ఉంది. ఈ హత్యకు నాలుగు రోజుల ముందు అమృత్‌పాల్ అతడిని కలిసినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది.
జైల్ బ్రేక్ భయంతోనే అస్సాంకు..
వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్‌పాల్ అనుచరులను అస్సాంలోని డిబ్రూఘర్ సెంట్రల్ జైలుకు పంపడానికి కారణాలున్నాయి. ఈ నిందితులంతా జైల్లో చేరి సాటి నేరగాళ్లలో అతివాద భావజాలం వ్యాప్తి చేస్తారని అధికారులు భయపడ్డారు. దీనికి తోడు బయట ఉన్నవారు మిగిలిన వారిని రెచ్చగొట్టి జైళ్లను బద్దలుకొట్టే అవకాశాలు ఉండటంతో అస్సాంకు తరలించారు. దీనికి తోడు పంజాబ్ జైళ్ల నుంచే వీరు తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final - IPL: ఐపీఎల్లో ఆ బంతులతోనే ప్రాక్టీస్ చేశాం
-
India News
Rajasthan: స్వీపర్‌కు ప్రసవం చేసిన మహిళా కానిస్టేబుళ్లు
-
Politics News
Kishan Reddy: తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా?: కిషన్‌రెడ్డి
-
Movies News
Spider Man: ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులకు తీపి కబురు
-
Sports News
MS Dhoni: విజయవంతంగా ధోని మోకాలికి శస్త్రచికిత్స
-
Crime News
Kurnool: జగన్ ప్రసంగిస్తుండగా యువకుడిపై పోలీసుల దాడి