Narendra Giri: ‘మహిళతో కలిసి ఉన్న ఫొటోను తయారుచేసి బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకున్నాడు’

మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.....

Published : 22 Sep 2021 02:19 IST

సూసైడ్‌నోట్‌లో విస్తుపోయే విషయాలు

ప్రయాగ్‌రాజ్‌: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేంద్రగిరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అతిథి గృహంలో పోలీసులకు లభించిన సూసైడ్‌ నోట్‌లో పలు విస్తుపోయే విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తన శిష్యుడు ఆనంద్‌ గిరి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

‘ఆనంద్‌గిరి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యా. సెప్టెంబర్‌ 13వ తేదీ రోజునే తనవు చాలించాలనుకున్నా. కానీ ధైర్యం సరిపోలేదు. కంప్యూటర్‌ సాయంతో.. ఓ మహిళతో నేను కలిసి ఉన్నట్లు చూపే ఫొటోను రూపొందించి నన్ను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఆనంద్‌గిరి సిద్ధమైనట్లు నాకు తెలిసింది. ఇది నన్ను కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఎంత గౌరవంగా జీవించాను. ఇలాంటి అపఖ్యాతితో జీవించలేను. అందుకే తనువు చాలిస్తున్నా’ అని నరేంద్రగిరి మృతదేహం వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

తన ఆత్మహత్యకు శిష్యుడు ఆనంద్‌గిరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కారణమని నరేంద్రగిరి ఆ నోట్‌లో వెల్లడించినట్లు సమాచారం. ఆధ్య తివారితోటు అతడి కుమారుడు సందీప్‌ తివారి కూడా కారణమని అందులో రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘నా మరణానికి కారణమైన వారిపై ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు చర్యలు చేపట్టాలి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది’ అని నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మహంత్‌ నరేంద్రగిరి సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని బాఘంబరి మఠం అతిథి గృహంలో పైకప్పునకు వేలాడుతూ ఆయన మృతదేహం కనపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ గదిలో 8 పేజీల లేఖ ఒకటి లభించిందని, అది మహంత్‌ నరేంద్ర రాసినదిగా భావిస్తున్నామని ప్రయాగ్‌రాజ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కె.పి.సింగ్‌ తెలిపారు. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే ఆశ్రమంలోని శిష్యులను విచారించగా పలు అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని