Anand Mahindra: రైల్వేలో ‘బేబీ బెర్తులు’.. మంత్రిపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

భారతీయ రైల్వే ఇటీవలే ఓ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. చిన్నారులు, పసిబిడ్డలతో ప్రయాణించే వారి సౌకర్యార్థం లఖ్‌నవూ మెయిల్ రైలులో ‘బేబీ బెర్తులు’ అమర్చింది.......

Published : 14 May 2022 02:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ రైల్వే ఇటీవలే ఓ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. చిన్నారులు, పసిబిడ్డలతో ప్రయాణించే వారి సౌకర్యార్థం లఖ్‌నవూ మెయిల్ రైలులో ‘బేబీ బెర్తులు’ అమర్చింది. దిగువన ఉండే ప్రధాన బెర్తుల్లో చిన్నారులు నిద్రించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేసింది. ఈ తరహా ప్రాజెక్టు చేపట్టినందుకుగానూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా అభినందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.

బేబీ బెర్తులకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ ట్విటర్‌ వేదికగా ఆనంద్‌ మహీంద్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైల్వేలతో పోలిస్తే భారతీయ రైల్వేలు విభిన్నంగా ఉండాలని నేను ఎలాగైతే అనుకున్నానో ఇప్పుడు అలాగే చూస్తున్నా. మానవతా దృక్పథంతో చేసిన ఈ డిజైన్ అశ్విని వైష్ణవ్ విద్య, అనుభవానికి నిదర్శనం. ఇలాంటివి మీ నుంచి మరిన్ని ఆశిస్తున్నా. మెదడు, మనసు రెండింటిని కలిపి మీరు చేసిన ఈ ఆలోచన  అద్భుతం’ అంటూ మహీంద్రా మెచ్చుకున్నారు. కాగా ఈ ట్వీట్‌కు రైల్వే మంత్రి స్పందించారు. ఈ తరహా ప్రాజెక్టులు మరిన్ని రానున్నట్లు పేర్కొన్నారు. ఈ సంభాషణ ఇంతటితో ఆగలేదు. మంత్రి ట్వీట్‌కు మహీంద్రా ప్రతిస్పందిస్తూ.. మీరు చేపట్టే గొప్ప పనుల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ పేర్కొన్నారు.

ఇదీ ప్రాజెక్టు

రైలులోని లోయర్‌ బెర్తులో చిన్న పిల్లలు పడుకునేందుకు వీలుగా బేబీ బెర్తులను అటాచ్‌ చేస్తున్నారు. వినియోగంలో లేనప్పుడు వాటిని మడతపెట్టి సీటు వెనకాల అమర్చవచ్చు. ప్రస్తుతం లఖ్‌నవూ మెయిల్‌లోని ఏసీ-3 కోచ్‌లో 770 మి.మీ. పొడవు, 255 మి.మీ. వెడల్పు, 76.2 మి.మీ. ఎత్తుతో రెండు సీట్లకు ఈ బేబీ బెర్తులను అమర్చారు. ఈ ప్రాజెక్టుపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతం వీటిని రెండు సీట్లకే అమర్చామని, ఇది ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయం అనంతరం తుది మెరుగులు దిద్ది మరిన్ని రైళ్లలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం బుకింగ్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని