Modi: మోదీని ఆకర్షించిన అరటిపండ్లు.. మీరు రుచి చూడాల్సిందేనన్న రైతు

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం-కిసాన్‌) పథకం కింద దేశవ్యాప్తంగా పదో విడత ఆర్థిక సాయం నిధులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం విడుదల చేశారు.

Published : 02 Jan 2022 01:30 IST

లఖ్‌నవూ: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం కింద దేశవ్యాప్తంగా పదో విడత ఆర్థిక సాయం నిధులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన రైతులతో ప్రధాని.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ రైతులు పండించిన ఓ ప్రత్యేక రకం అరటిపండ్లు మోదీ దృష్టిని ఆకర్షించాయి. వాటి గురించి అడగ్గానే.. ఆ రైతు ఎంతో సంబరపడ్డారు. ‘ఆ పండ్లను మీరు రుచి చూడాల్సిందే’ అంటూ ప్రధానిని కోరారు.

మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలను ప్రదర్శనగా ఉంచి.. వాటి గురించి ప్రధానికి వివరించారు. ఈ క్రమంలో లఖ్‌నవూ రైతులు ఏర్పాటు చేసిన స్టాల్‌లోని అరటిపండ్లు మోదీ దృష్టిని ఆకర్షించాయి. ‘‘ఈ అరటిపండ్లు చాలా పెద్దగా ఉన్నాయే..’’ అంటూ ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి ధరమ్‌చంద్‌ అనే రైతు స్పందిస్తూ.. ‘‘సర్‌.. ఇవి బ్రాండెండ్‌ అరటిపండ్లు. వీటిని నవీన్‌ కేలా అంటారు. సర్‌ దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. నాకు ఫోన్‌ చేయండి. మీకు ఈ అరటిపండ్లు తీసుకొచ్చి ఇస్తాను. మీరు వీటిని రుచి చూడాల్సిందే’’ అంటూ సంతోషంతో చెప్పుకొచ్చారు. దీంతో మోదీ సంతోషంతో చిరునవ్వులు చిందించారు.

ఆ తర్వాత తనకు మాట్లాడేందుకు ఇంకొంత సమయం కావాలని ధరమ్‌ చంద్‌ ప్రధానిని కోరారు. ఇందుకు మోదీ కూడా అంగీకరించారు. ఈ సందర్భంగా ధరమ్‌చంద్‌పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ‘‘మీరు మాట్లాడిన మాటలు దేశంలోని రైతులందరూ విన్నారు. మీలోని ఆత్మవిశ్వాసం.. వారందరిలో స్ఫూర్తి నింపుతుంది. రైతుల కృషికి మీరు మరింత విలువ తీసుకొచ్చారు’’ అని మెచ్చుకున్నారు. పీఎం-కిసాన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతులకు 10వ విడత ఆర్థిక సాయంగా.. రూ.20,900కోట్లను ప్రధాని మోదీ శనివారం విడుదల చేశారు. పీఎం కిసాన్‌ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తుండగా.. ఏటా మూడు వాయిదాల్లో రూ.2వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని