ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం: 8మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లా నీతీ లోయకు సమీపంలో శుక్రవారం భారీ మంచుచరియలు విరిగిపడి 8 మంది దుర్మరణం చెందారు. మరో 400 మందికి పైగా కూలీలను సహాయకసిబ్బంది

Updated : 24 Apr 2021 15:46 IST

గోపేశ్వర్‌: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లా నీతీ లోయకు సమీపంలో శుక్రవారం భారీ మంచుచరియలు విరిగిపడి 8 మంది దుర్మరణం చెందారు. మరో 400 మందికి పైగా కూలీలను సహాయ సిబ్బంది రక్షించారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సుమ్నా ప్రాంతంలో ఈ హిమపాతం చోటుచేసుకుంది. ఘటన సమయంలో వందల మంది సిబ్బంది సుమ్నా- రిమ్‌ఖిమ్‌ రహదారి పనుల్లో ఉన్నారు.

సమాచారమందుకున్న ఆర్మీ, సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దట్టంగా మంచు కురవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది దాదాపు 430 మంది కూలీలను రక్షించారు. ఇప్పటివరకు 8 మృతదేహాలను గుర్తించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రమాద ప్రాంతంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ విహంగ వీక్షణం చేపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నివిధాలా సాయం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సీఎం ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛమోలీలోనే భారీ మంచుచరియలు విరిగిపడిన ఘోర విపత్తులో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని