Covaxin: చిన్నారులకు బూస్టర్‌ డోసు.. తుదిదశ ప్రయోగాలకు అనుమతి కోరిన భారత్‌ బయోటెక్‌

రెండు నుంచి 18ఏళ్ల వయసు చిన్నారులకు బూస్టర్‌ డోసును తీసుకొచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ సిద్ధమైంది.

Published : 04 May 2022 18:37 IST

కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు ప్రయోగాలకు సిద్ధం

దిల్లీ: దేశవ్యాప్తంగా చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఐదేళ్ల వయసున్న చిన్నారులకు త్వరలోనే టీకా పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. ఇదే సమయంలో రెండు నుంచి 18ఏళ్ల వయసు చిన్నారులకు బూస్టర్‌ డోసును తీసుకొచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా కొవాగ్జిన్‌ రెండు, మూడో (తుదిదశ) ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సంప్రదించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్‌ 29నే భారత్ బయోటెక్‌ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

తుది దశ ప్రయోగాల్లో భాగంగా వ్యాక్సిన్‌ భద్రత, దుష్ర్పభావాల తీరు, రోగనిరోధకత సామర్థ్యం వంటి అంశాలపై వాలంటీర్లపై భారత్‌ బయోటెక్‌ పరీక్షలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల ఈ తుదిదశ ప్రయోగాలు జరిగే అవకాశాలున్నాయి. దిల్లీ ఎయిమ్స్‌, పట్నాతోపాటు పలు ప్రదేశాల్లో కొవాగ్జిన్‌ రెండు, మూడోదశ ప్రయోగాలు జరుగనున్నాయి.

ఇదిలాఉంటే, ప్రస్తుతం 18ఏళ్ళ వయసుపైబడిన వారికి ప్రికాషన్‌ డోసు పేరుతో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ల పంపిణీ కొనసాగుతోంది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల గడువు పూర్తైన వారికి బూస్టర్‌ డోసును అందిస్తున్నారు. జనవరి 10నుంచి ప్రారంభమైన బూస్టర్‌ డోసు పంపిణీ ప్రస్తుతం ప్రైవేటులో మాత్రమే అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని