Indian Railways: ముంబయి- అహ్మదాబాద్‌ రైలు మార్గం.. 622 కి.మీల మేర కంచె నిర్మాణం!

ముంబయి- అహ్మదాబాద్‌ రైలు మార్గంలో పట్టాలపై పశువుల సంచారాన్ని కట్టడి చేసేందుకు రైల్వేశాఖ ముందుకొచ్చింది. ఈ మార్గంలో 622 కిలోమీటర్ల మేర కంచెను నిర్మిస్తోంది.

Published : 29 Jan 2023 22:57 IST

దిల్లీ: ముంబయి- అహ్మదాబాద్‌ మార్గంలో పశువులను ఢీకొని ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express)‌’ రైలు రెండు సందర్భాల్లో నిలిచిపోయిన విషయం చర్చనీయాంశమైన తెలిసిందే. ఈ క్రమంలోనే భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాల(Cattle Run Over)ను నివారించేందుకు, పట్టాలపై పశువుల సంచారాన్ని కట్టడి చేసేందుకు రైల్వేశాఖ(Indian Railway) ముందుకొచ్చింది. ముంబయి- అహ్మదాబాద్‌ల మధ్య 622 కిలోమీటర్ల పొడవునా కంచె(Metal Beam Fencing) నిర్మాణ పనులు ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌(Ashwini Vaishnaw) ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

కంచె ఏర్పాటు పనులకు దాదాపు రూ.245.26 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ఎనిమిది టెండర్లు పూర్తయ్యాయని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వేశాఖ ఆదివారం వెల్లడించింది. మే నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. గాంధీనగర్- ముంబయిల మధ్య అక్టోబర్‌ 1 నుంచి ‘వందే భారత్‌’ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒకసారి గేదెల గుంపును ఢీకొని, మరోసారి ఆవును ఢీకొని ఈ రైలు నిలిచిపోయింది. దీంతో రైల్వే అధికారులు పరిష్కార చర్యలు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని