Operation Chakra: సైబర్‌ నేరస్థులే లక్ష్యం.. దేశవ్యాప్తంగా 105 చోట్ల సీబీఐ దాడులు

సైబర్‌ నేరస్థుల ఆట కట్టించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్‌ చక్ర’ను మొదలుపెట్టిన సీబీఐ.. ఆర్థిక నేరాలకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు మొదలుపెట్టింది.

Published : 05 Oct 2022 00:00 IST

దిల్లీ: సైబర్‌ నేరస్థుల ఆట కట్టించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్‌ చక్ర’ను (Operation Chakra) మొదలుపెట్టిన సీబీఐ.. ఆర్థిక నేరాలకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్ల (Cyber Criminals) ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు జరిపింది. ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్‌ 4న) దేశవ్యాప్తంగా 105 చోట్ల సోదాలు చేపట్టినట్లు వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సహాయంతో ఈ దాడులు జరుపుతున్నట్లు తెలిపింది.

పలు రాష్ట్రాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు భావిస్తోన్న 300 మంది అనుమానితులపై సీబీఐ దృష్టి సారించింది. మంగళవారం మొదలుపెట్టిన ఈ ఆపరేషన్‌లో 87 ప్రాంతాల్లో సీబీఐ నేతృత్వంలో దాడులు జరుగుతుండగా.. 18 ప్రాంతాల్లో మాత్రం ఆయా రాష్ట్రాల పోలీసులు సోదాలు చేపడుతున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, అండమాన్‌ నికోబార్‌లో నాలుగు, దిల్లీలో ఐదు, చండీగఢ్‌లో మూడు, పంజాబ్‌, కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో రెండు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. వీటితోపాటు మిగతా రాష్ట్రాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో జరిపిన దాడుల్లో రూ.1.5కోట్ల నగదు, కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.

ఇంటర్‌పోల్‌, ఎఫ్‌బీఐ, రాయల్‌ కెనడియన్‌ మౌంటెయిన్‌ పోలీస్‌తోపాటు ఆస్ట్రేలియన్‌ ఫెడరల్‌ పోలీసులు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దాడులకు ఉపక్రమించినట్లు సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని అమాయక పౌరులే లక్ష్యంగా పుణె, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తోన్న రెండు కాల్‌ సెంటర్లపై దాడి చేసినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI)కి తెలియజేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని