CBSE పరీక్షలు: ‘10’ రద్దు.. ‘12’ వాయిదా

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలు రద్దు

Updated : 14 Apr 2021 16:46 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 

‘‘దేశంలో మహమ్మారి ఉద్ధృతి.. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం’’ అని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. పదో తరగతి విద్యార్థుల ప్రతిభ, అంతర్గత అధ్యయనం ఆధారంగా మార్కుల కేటాయింపు జరుగుతుందన్న కేంద్రమంత్రి.. ఫలితాలపై అభ్యంతరాలుంటే ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత అనువైన సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

కరోనా విజృంభణ దృష్ట్యా వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి పరీక్షలపై చర్చలు జరిపారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని చెప్పినట్లు రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. అకడమిక్‌ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని