
Work From Home: కేంద్ర ఉద్యోగులకు ఊరట
దిల్లీ: కరోనా తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట కల్పిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని వర్గాలకు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. గర్భిణీ స్త్రీలు, వికలాంగ ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ-డీఓపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్‌లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. కార్యాలయంలో విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.
ఇప్పటికే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తించేందుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మరింత విస్తరిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలలో పనిచేసే గ్రూప్ బీ, గ్రూప్ సీ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తాయి. కాగా గ్రూప్ ఏ స్థాయి అధికారులకు పనిగంటల్లో వెసులుబాటు లభిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.