Hacking Row: హ్యాకింగ్‌ ఆరోపణలు.. యాపిల్‌కు కేంద్రం నోటీసులు

విపక్ష ఎంపీల ఐఫోన్‌లకు హ్యాక్‌ అలర్ట్‌ మెసేజ్‌లు రావడంపై కేంద్రం ఐటీ మంత్రిత్వ శాఖ గురువారం యాపిల్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

Updated : 02 Nov 2023 15:36 IST

దిల్లీ: విపక్ష ఎంపీల ఐఫోన్లకు (iPhone) హ్యాకింగ్ అలర్ట్‌ మెసేజ్‌లు రావడంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్‌ (Apple) సంస్థకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్నారని ధ్రువీకరించేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని యాపిల్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ నోటీసుల విషయాన్ని ధ్రువీకరించారు. మరోవైపు హ్యాకింగ్ ఆరోపణలపై భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పానెస్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-IN) విచారణ జరుపుతోందని తెలిపారు. 

అంతకముందు విపక్ష ఎంపీల ఐఫోన్‌లకు అలర్ట్‌ మెసేజ్‌లు రావడంపై యాపిల్ స్పందించింది. నోటిఫికేషన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమని పేర్కొంది. ఒక్కోసారి యాపిల్‌ ఫోన్లకు వచ్చే కొన్ని అలర్ట్‌ నోటిఫికేషన్లు నకిలీ హెచ్చరికలు కూడా అయి ఉండొచ్చు అని తెలిపింది.

ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు.. సమన్లు వాపస్‌ తీసుకోవాలని లేఖ..!

తమ యాపిల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగిందని మంగళవారం పలువురు విపక్ష నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమ ఐఫోన్లకు అలర్ట్‌ సందేశాలు వచ్చాయని వారు వెల్లడించారు. దీంతో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ.. హ్యాకింగ్‌ ప్రయత్నం జరిగినట్లు వెల్లువెత్తిన అనుమానాలపై ‘సెర్ట్‌ఇన్‌’ ద్వారా సమగ్ర సాంకేతిక విచారణ జరుపుతామని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని