Viral news: 9 ఏళ్ల తర్వాత కేసు నమోదు.. పోలీసు అధికారికే తప్పని తిప్పలు!

అధిక లాభాలోస్తాయన్న మాటలు విని ఓ బీఎస్‌ఎఫ్‌ అధికారి అధికమొత్తంలో డిపాజిట్‌ చేసి మోసపోయాడు. డబ్బులు తిరిగి వచ్చిన మాట అటుంచింతే కేసు నమోదు చేయడానికి 9 ఏళ్లు పట్టింది.

Published : 08 Oct 2022 00:12 IST

ఇండోర్‌: ‘‘రూ. 50వేలు డిపాజిట్‌ చేయండి సంవత్సరం తిరిగేలోగా రూ.లక్ష పొందండి’’ లాంటి ఆఫర్లతో ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తుంటాయి. వాటి మాయలో పడితే రూ.లక్ష మాట దేవుడెరుగు..రూ.50 వేలకే సున్నం పడుతుంది. సరిగ్గా ఏడేళ్ల కిందట సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)కి చెందిన ఓ పోలీసు అధికారికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అధికమొత్తంలో లాభాలొస్తాయని చెబితే రూ.5.5 లక్షలను ఓ సంస్థ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశాడు. కొద్ది రోజులకే తాను మోసపోయినట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన ఆధారాలు లేవని కేసు నమోదు చెయ్యలేదు. చివరికి తొమ్మిదేళ్ల తర్వాత సీఎం హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి, తన గోడును వెల్లబోసుకున్నాడు. ఆ తర్వాత సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌ గుప్తా ఇండోర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంపులో విధులు నిర్వర్తించేవాడు. ఒక రోజు గురుగ్రామ్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఫోన్‌ వచ్చింది. లాభదాయకమైన అవకాశాలున్నాయని, తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని  కోరారు. దీంతో అక్టోబరు 7, 2014న ఆయన తన ఖాతా నుంచి రూ.5.5 లక్షలను సంస్థ ఖాతాకు బదిలీ చేశాడు. ఏడాది తిరగక ముందే తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో సెబీ(SEBI)లో ఫిర్యాదు చేశాడు. దాని నుంచి సమాధానం వచ్చే సరికి రెండేళ్లు పట్టింది. ఆ కంపెనీ పేరు సెబీలో నమోదు కాలేదని అధికారులు చేతులెత్తేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనిల్‌కుమార్‌ నిర్ణయించుకున్నాడు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఫలితం లేకపోయింది. సరైన ఆధారాలు లేవని కేసు నమోదు చేయలేదు. చివరకు విసిగిపోయిన అనిల్‌ కుమార్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌కు ఫోన్‌  చేసిన తన బాధను వినిపించాడు. దీంతో గురుగ్రామ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనిల్‌కుమార్‌, కంపెనీ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని