
Chennai Floods: అధికారులూ... 2015 నుంచి అసలేం పని చేస్తున్నారు?
పాలన తీరుపై ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు వివిధ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌పై మద్రాసు హైకోర్టు మండిపడింది. వర్షాల వేళ నగరంలో వరదల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైయ్యారని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌ను విమర్శించింది. 2015లో తొలిసారి చెన్నైకి వరదలు ముంచెత్తాయి. ఆరేళ్ల నుంచి చెన్నై వరుసగా వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అధికారులు ఏమి చేస్తున్నారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే విషయాన్ని సుమోటోగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.
‘‘ఏడాదిలో సగం రోజులు నీటి కోసం వెతుక్కునే పరిస్థితి ఉంటే.. మిగతా సగం నీళ్లలోనే చచ్చిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. దేశంలోనే అగ్రగామి రాష్ట్రం ఇలాంటి స్థితిలో ఉండకూడదు’’
- జస్టిస్ సంజీబ్ బెనర్జీ,మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
చెన్నైతో పాటు చంగళ్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని శివారు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 210 మీమీ వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, 260 గుడిసెలు, 70 ఇళ్లు దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లోనూ చెన్నై, పొరుగు జిల్లాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
ఇవీ చదవండి
Advertisement