China Spy: దేశంలో చైనా గూఢచారి

భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్ జున్‌వే.. చైనా గూఢచారిగా బీఎస్ఎఫ్ విచారణలో వెల్లడైంది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్‌వే మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు....

Published : 12 Jun 2021 17:35 IST

భారత్‌ నుంచి 1300 సిమ్‌కార్డుల తరలింపు

దిల్లీ: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనాకు చెందిన హాన్ జున్‌వే..  ఆ దేశ గూఢచారిగా బీఎస్ఎఫ్ విచారణలో వెల్లడైంది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్‌వే మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో వందల సిమ్‌కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు తరలించడం సహా.. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. జున్‌వే గురుగ్రామ్‌లో ఓ హోటల్‌ను  సైతం నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. 

బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్‌ జున్‌వే విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థ తరఫున జున్‌వే భారత్‌లో గూఢచారిగా పనిచేస్తున్నట్లు సరిహద్దు భద్రతాదళం విచారణలో వెల్లడైంది. హాన్‌ జున్‌వే వద్ద లభించిన ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని పరిశీలించగా ఈ విషయం బయటపడినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు.

జున్‌వే తన సహచరుడితో కలిసి ఇప్పటివరకు 1300 పైగా సిమ్‌కార్డులు లో దుస్తుల్లో దాచి అక్రమంగా భారత్‌ నుంచి చైనాకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సిమ్‌కార్డుల సాయంతో బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేయడం సహా.. ఇతరత్రా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు గురుగ్రామ్‌లో ‘స్టార్‌ స్ప్రింగ్‌’ పేరిట ఓ హోటల్‌ను నడుపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ హోటల్‌లో కొంత మంది చైనా దేశస్థులను సిబ్బందిగా చేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.

అక్రమంగా సిమ్‌కార్డుల తరలింపునకు సంబంధించి లఖ్‌నవూ, ఏటీఎస్‌లో నమోదైన కేసుల్లో హాన్‌ జున్‌వే వాంటెడ్‌ నేరస్థుడిగా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఆ కేసు కారణంగా భారతీయ వీసా లభించకపోవడంతో బంగ్లాదేశ్‌ బిజినెస్‌ వీసాతో భారత్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. నిందితుడు గతంలో నాలుగు సార్లు భారత్‌కు వచ్చినట్లు విచారణలో తేలింది. 2010లో హైదరాబాద్‌ వచ్చిన జున్‌వే.. 2019 తర్వాత దిల్లీ, గురుగ్రామ్‌ ప్రాంతాలకు మూడు సార్లు వచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. నిందితుడి ప్రాథమిక విచారణ పూర్తిచేసిన బీఎస్‌ఎఫ్‌ అధికారులు అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని