Covid Deaths: భారత్‌లోనే కొవిడ్‌ మరణాలు తక్కువ..!

భారత్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు 374 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 30 Mar 2022 01:51 IST

ప్రతి పదిలక్షల జనాభాకు 374 మంది మృతి చెందారన్న ఆరోగ్యశాఖ

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చంటూ అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రతి పదిలక్షల జనాభాకు 374 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న అమెరికా, బ్రెజిల్‌, రష్యా, మెక్సికో దేశాలతో పోలిస్తే కొవిడ్‌ మరణాల రేటు భారత్‌లోనే తక్కువని పేర్కొంది. కొవిడ్‌ మరణాలు అధికంగా ఉన్నాయంటూ వస్తోన్న వార్తలపై రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ప్రతి పదిలక్షల మందికి (374 మరణాలు)అతి తక్కువ కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్న దేశాల్లో భారత్‌ ఒకటి. అమెరికాలో ప్రతిపదిలక్షల మందికి 2920 మరణాలు చోటుచేసుకోగా.. బ్రెజిల్‌లో 3092, రష్యాలో 2506, మెక్సికోలో 2498 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్‌ మరణాల రేటు చాలా తక్కువ’ అని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ మరణాలకు సంబంధించి మే 10, 2020న భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందన్న ఆమె.. వాటిని నమోదు చేసేందుకు పాటించాల్సిన నిబంధనలపై అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

‘కొవిడ్‌ మరణాలు అధికంగా చోటుచేసుకున్నాయంటూ వచ్చిన నివేదికలన్నీ ప్రామాణికం కాని పద్ధతులు, ఇతర సమాచారం ఆధారంగా అంచనా వేసినవి. వాటికి విశ్వసనీయత లేదు. కేవలం కొంత జనాభాకు సంబంధించి గణాంక పద్ధతిలో రూపొందించినవి. అలా పరిమిత నమూనాలను పరిగణనలోకి తీసుకొని దేశం మొత్తం అంచనా వేశారు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ పేర్కొన్నారు. అయితే, దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్రాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని