Oxygen: కేంద్రం చెప్పిందంతా అబద్ధం..!

కరోనా రెండో ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా కొవిడ్‌ బాధితులెవరూ ప్రాణాలు కోల్పోలేదని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Published : 21 Jul 2021 14:46 IST

భాజపా సర్కారుపై ప్రతిపక్షాల ధ్వజం

దిల్లీ: కరోనా రెండో ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా కొవిడ్‌ బాధితులెవరూ ప్రాణాలు కోల్పోలేదని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే భాజపా సర్కారు ఇలాంటి అబద్ధాలు చెబుతోందని దుయ్యబట్టాయి. ఆక్సిజన్‌ కొరతే లేకపోతే ఆసుపత్రులు ఎందుకు కోర్టులకు వెళ్తాయని విమర్శలు గుప్పించాయి. 

కేంద్రం ప్రకటనపై దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ఆక్సిజన్‌ సంక్షోభం లేకపోతే ఆసుపత్రులు ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాయి. ప్రాణవాయువు కొరతను ఆసుపత్రులు, మీడియా ఎప్పటికప్పుడు బయటపెట్టాయి. దిల్లీ సహా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఆక్సిజన్‌ లేక ఎంతోమంది కొవిడ్‌ బాధితులు మరణించారు. కానీ, కేంద్రం ఒక్కరూ కూడా చనిపోలేదని చెప్పడం పూర్తిగా అవాస్తవం’’ అని జైన్‌ వ్యాఖ్యానించారు. అటు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కూడా కేంద్రం ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. రెండో దశ ఉద్ధృతి సమయంలో ప్రాణవాయువు నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బూటకపు ప్రకటనలు చేస్తోందని దుయ్యబట్టారు. 

కేంద్రంపై వారు కోర్టుకెళ్లాలి..

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా కేంద్రంపై విమర్శలు కురిపించారు. ఆక్సిజన్‌ కొరతతో చనిపోయిన కొవిడ్‌ బాధితుల కుటుంబాలు కేంద్రంపై కోర్టుకు వెళ్లాలని వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రాణవాయువు అందుబాటులో లేక చాలా రాష్ట్రాల్లో ఎంతో మంది కరోనా బాధితులు చనిపోయారు. కానీ, కేంద్రం మాత్రం చనిపోలేదని చెప్పడం గమనార్హం. ఇప్పుడు మృతిచెందిన వారి బంధువులంతా కేంద్రాన్ని కోర్టుకు తీసుకెళ్లాలి. కేంద్రం తీరు చూస్తుంటే నిజానికి దూరంగా పారిపోతున్నట్లు కన్పిస్తోంది. బహుశా.. ఇదంతా పెగాసస్‌ ప్రభావమేమో!’ అని రౌత్‌ ఎద్దేవా చేశారు. 

రాష్ట్రాలు చెప్పిందే చెప్పాం: భాజపా

ప్రతిపక్షాల ఆరోపణలను భాజపా ఖండించింది. కొవిడ్ మరణాలపై రాష్ట్రాలు పంచుకున్న డేటానే కేంద్రం చెప్పిందని, ఇప్పుడు ప్రతిపక్షాలు కావాలనే దీనిపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడింది. ‘‘ఆరోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కొవిడ్‌ మరణాల డేటాను కేంద్రం తయారుచేయలేదు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను నుంచి సేకరించిన డేటానే మేం వెల్లడించాం. ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ చనిపోలేదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ నివేదికల్లో పేర్కొనలేదు. అందుకే కేంద్రం కూడా అలాగే చెప్పింది’’ అని భాజపా నేత సంబిత్‌ పాత్రా వెల్లడించారు. 

రెండోదశలో ప్రాణవాయువు లభించక రోడ్లపైనా, ఆసుపత్రుల్లోను కొవిడ్‌ బాధితులు భారీ సంఖ్యలో చనిపోయారా? లేదా? అన్న ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ సమాధానమిచ్చారు. ఇలాంటి మరణాలు చోటుచేసుకున్నట్టు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలేవీ నివేదించలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని