Karnataka: జోడో యాత్రలో ‘పేసీఎం’ వివాదం.. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ మండిపాటు!

కర్ణాటకలో కొనసాగుతోన్న కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’లో పేసీఎం టీషర్ట్‌ ధరించిన ఓ కార్యకర్తతో పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కర్ణాటక కాంగ్రెస్‌..

Published : 01 Oct 2022 20:38 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో కొనసాగుతోన్న కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra)’లో పేసీఎం(PayCM) టీషర్ట్‌ ధరించిన ఓ కార్యకర్తతో పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమైంది. దీన్ని తీవ్రంగా ఖండించిన కర్ణాటక కాంగ్రెస్‌.. పోలీసులు అతనితో బలవంతంగా టీషర్ట్‌ విప్పించి, దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. వారికి ఈ అధికారం ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించింది. ఘటనకు సంబంధించిన ఓ వీడియోను శనివారం ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ‘పార్టీ కార్యకర్తపై దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. టీషర్ట్‌ విప్పించి, అతనిపై దాడి చేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? దాడి చేసినవారిని వెంటనే సస్పెండ్ చేయాలి' అని డిమాండ్‌ చేసింది.

మాజీ సీఎం సిద్ధరామయ్య సైతం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ చేపడుతోన్న అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని రాజకీయంగా ఎదుర్కొలేకే.. పోలీసులను ఉపయోగించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు భాజపాపై మండిపడ్డారు. మరోవైపు.. పోలీసులు ఆ కార్యకర్తపై కేసు నమోదు చేయడం గమనార్హం. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పేర్కొంటూ ఇటీవల బెంగళూరులో ‘పేసీఎం’ పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్‌ పార్టీనే ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోందని సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆరోపించారు. బెంగళూరు పోలీసులు సైతం.. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని