Corbevax: ‘కార్బెవాక్స్‌’ సురక్షితం.. నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌!

దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 12 నుంచి 18ఏళ్ల వారికోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కార్బెవాక్స్‌’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) విషయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

Published : 15 Feb 2022 22:32 IST

12-18ఏళ్ల వారికి త్వరలోనే అందుబాటులోకి

దిల్లీ: దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 12 నుంచి 18ఏళ్ల వారికోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కార్బెవాక్స్‌’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) విషయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీంతో కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ త్వరలోనే తుది ఆమోదం తెలుపనుంది. ఈ విషయాన్ని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా ధ్రువీకరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌-ఇ లిమిటెడ్‌ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. తుదిదశ ప్రయోగాల సమాచారం మధ్యంతర ఫలితాలను విశ్లేషించిన అనంతరం 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ సంస్ధ ఇటీవలే డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌ (Corbevax) సురక్షితమని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) వర్కింగ్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్‌ మంచి రోగనిరోధకత కల్పించడంతోపాటు ఇతర వ్యాక్సిన్‌లతో పోలిస్తే భారీ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొంది. ‘ప్రొటీన్‌ సబ్‌యూనిట్‌ వ్యాక్సిన్‌లు సురక్షితం. రోగనిరోధకతను కల్పించడంలోనూ మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌లతో పోలిస్తే దుష్ప్రభావాలు కూడా తక్కువే. వీటితోపాటు యాంటీబాడీ స్థాయిలు గణనీయంగా ఉండడం మరో ముఖ్యమైన అంశం’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా వెల్లడించారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌ కంటే డెల్టాపై అధిక నిరోధకతను కలిగి ఉందన్నారు. హెపటైటిస్‌-బీ కి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ కూడా ప్రొటీన్‌ సబ్‌యూనిట్‌ తరహాదేనని గుర్తుచేశారు. 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవొవాక్స్‌తో కలిపి రెండు టీకాలు అందుబాటులోకి వచ్చినట్లేనని డాక్టర్‌ అరోఢా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, బయోలాజికల్‌-ఇ తయారు చేసిన కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ను సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 5కోట్ల డోసులను కేంద్రం ఇప్పటికే ఆర్డర్‌ చేసింది. ఒక్కో డోసు రూ.145 చొప్పున కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. రెండు డోసుల్లో తీసుకునే కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని