XE Threat: కరోనా ఇంకా అంతరించిపోలేదు : మోదీ

కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ అది ఇంకా అంతరించిపోలేదని, మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 10 Apr 2022 16:30 IST

అప్రమత్తంగా ఉండాలని సూచించిన భారత ప్రధాని

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ అది ఇంకా అంతరించిపోలేదని, మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందుకే కరోనాపై చేస్తోన్న పోరులో ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. ఎన్నో రూపాలను మార్చుకుంటున్న మహమ్మారి మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎప్పటికీ తెలియదన్నారు. ఇటువంటి కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటివరకు 185కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామన్న ఆయన.. ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అయితే, అత్యంత వేగంగా సంక్రమించే సామర్థ్యమున్నట్లు భావిస్తోన్న ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ గుజరాత్‌లో వెలుగు చూసిన నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి అప్రమత్తం చేశారు.

‘కరోనా మహమ్మారి అతిపెద్ద సంక్షోభం, అది ఇప్పుడే ముగిసిపోయిందని చెప్పడం లేదు. ప్రస్తుతం విరామం తీసుకొని ఉండవచ్చు, కానీ, మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో మనకు తెలియదు. అది ఎన్నో రూపాలు కలిగిన వ్యాధి. అటువంటి దాన్ని అడ్డుకునేందుకు ఇప్పటివరకు 185 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించి యావత్‌ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాం. ప్రజల సహకారంతోనే అది సాధ్యమైంది’ అని గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఓ కార్యక్రమంలో వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్న మోదీ ఈ విధంగా మాట్లాడారు. ఇదే సమయంలో మాతృభూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించిన మోదీ.. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉంటే, గుజరాత్‌లో కొవిడ్‌-19కు సంబంధించి ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ తొలి కేసు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గత నెల ముంబయి నుంచి వడోదరా వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ ఉపరకమైన ఎక్స్‌ఈ సోకిందని వెల్లడించారు. బాధితుడు వడోదరాలో ఉన్నప్పుడు మార్చి 12న కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆ మర్నాడే ఆయన స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా ముంబయి తిరిగి వెళ్లిపోయారని చెప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని ప్రయోగశాల ఇచ్చిన నివేదిక ప్రకారం అతనికి సోకింది ఎక్స్‌ఈ వేరియంట్‌గా తేలిందన్నారు. అయితే, ప్రస్తుతం ముంబయిలో ఉన్న బాధితుడి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. గతంలో వచ్చిన కరోనా స్ట్రెయిన్‌ల కంటే ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ ఎక్కువ సాంక్రమికశక్తితో ఉన్నట్లు కనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని