వైరస్ ఏమి చేయగలదో గుర్తుచేసింది:WHO

రెండో దశలో భారత్‌లో కరోనా సృష్టిస్తున్న ప్రళయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 24 Apr 2021 17:39 IST

భారత్‌లో వైరస్ ఉద్ధృతిపై ఆందోళన

జెనీవా: రెండో దశలో భారత్‌లో కరోనా సృష్టిస్తున్న ప్రళయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ను తక్కువ చేస్తే..ఏ స్థాయిలో విజృంభించగలదో వినాశనకరంగా గుర్తుచేసిందని వ్యాఖ్యానించారు. 

‘భారత్‌లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని మాకు తెలుసు. వాటిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా వేర్వేరు అవసరాలున్నాయి. కరోనా కట్టడికి, టీకా ఉత్పత్తి నిమిత్తం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం. కొవిడ్‌తో ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వైరస్ ఏమి చేయగలదో భారత్‌లోని పరిస్థితులే వినాశనకరంగా గుర్తుచేస్తున్నాయి. ప్రజారోగ్య చర్యలు, టీకాలు, చికిత్స వంటి సమగ్ర విధానాలతో వైరస్‌కు వ్యతిరేకంగా ముందుకెళ్లాలి’ అంటూ టెడ్రోస్ భారత్‌ను అప్రమత్తం చేశారు. అలాగే వైరస్‌ను తక్కువగా అంచనా వేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రపంచ దేశాలను హెచ్చరించారు. 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా సంక్రమిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక రోజూవారీ కేసులతో భారత్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆక్సిజన్, వైద్యసదుపాయాల కొరత ప్రభుత్వాలు, ప్రజల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా 3.46లక్షల మందికి కరోనా సోకగా..2,624 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని