Weight loss: 8 నెలల్లో 46 కిలోలు తగ్గి ‘స్లిమ్‌ కాప్‌’లా.. ఎలాగో చదవండి!

కేవలం 8 నెలల్లోనే 46కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు దిల్లీ డీసీపీ జితేంద్ర మణి. ఇందుకోసం ఆయన తీసుకున్న జాగ్రత్తలేంటో తెలుసుకుందామా..

Updated : 29 Dec 2022 09:25 IST

దిల్లీ: ఒకప్పుడు అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ఇప్పుడు స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దిల్లీలో డీసీపీ(Delhi DCP)గా పనిచేస్తున్న జితేందర్‌ మణి(Jitendra Mani) కేవలం ఎనిమిది నెలల్లోనే 46కిలోల బరువు తగ్గి(Weight loss) స్లిమ్‌ కాప్‌లా మారిపోయారు. ఇందుకోసం ఆయన ఏ ఔషధాలు వాడారేమోనని అనుకుంటే మీరు పొరబడినట్టే. కేవలం కఠినమైన ఆహార నియమాలు, కసరత్తులతోనే ఇంతగా ఫిట్‌నెస్‌ సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతంలో 130కిలోల బరువు ఉన్నప్పుడు జీతేంద్ర మణికి అనేక ఆరోగ్య సమస్యలు ఉండేవి. డయాబెటిస్‌, అధిక రక్తపోటు, కొవ్వు స్థాయిలు పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ ముప్పు నుంచి బయటపడాలని దృఢ సంకల్పం తీసుకున్న ఆయన.. తన జీవన శైలినే పూర్తిగా మార్చేశారు. ఇందుకోసం రోజూ 15వేల స్టెప్పులు వాకింగ్‌ చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొనేవారు.

అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన అన్నం, రోటీలు వంటి ఆహారం నుంచి సూప్‌లు, సలాడ్‌లు, పండ్లు వంటి అధిక పోషకాలు ఉండే ఆహారానికి మారారు. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్, కఠినమైన డైట్‌ పాటించడం ద్వారా కేవలం ఎనిమిది నెలల్లోనే నడుము పరిమాణం 12 ఇంచులు తగ్గించుకోవడమే కాకుండా కొలెస్ట్రాల్‌ స్థాయిలను ఐదో వంతు తగ్గించుకోగలిగారు.‘నేను మారాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రతి నెలలో 4.5లక్షల అడుగులు(స్టెప్స్‌) నడవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. ఎనిమిది నెలల్లో దాదాపు 32లక్షల స్టెప్పులు వాకింగ్‌ చేశా. ఇప్పుడు నా బరువు 84కిలోలకు తగ్గింది’’ అని డీసీపీ వివరించారు.

పోలీస్‌ ఉద్యోగంలో ఫిట్‌నెస్‌ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. దీంతో భారీ బరువు నుంచి  ఫిట్‌నెస్‌ కాప్‌గా మారేందుకు జితేంద్ర మణి చేసిన కృషిని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ అరోడా ప్రశంసించారు. 90వేల మందికి పైగా పోలీసు సిబ్బంది హాజరైన ఓ కార్యక్రమంలో పోలీస్‌ శాఖ తరఫున ఆయనకు ఓ సర్టిఫికెట్‌ ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ జితేంద్ర మణి మాట్లాడుతూ.. తాను బరువు తగ్గేందుకు నిరంతరం చేసేలా తన పైఅధికారులు, సహోద్యోగులు ఎంతగానో సహకరించి ప్రోత్సాహం అందించారని, వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని