కేంద్రానికి దిల్లీ హైకోర్టు షోకాజ్‌ నోటీసు

ఆక్సిజన్‌ సరఫరాపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందున ధిక్కరణ చర్యలకు ఎందుకు ఉపక్రమించకూడదని ప్రశ్నిస్తూ కేంద్రానికి దిల్లీ హైకోర్టు షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

Published : 04 May 2021 20:20 IST

ధిక్కరణ చర్యలు ఎందుకు ఉపక్రమించకూడదని ప్రశ్న

దిల్లీ: దేశరాజధాని దిల్లీకి అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేటాయించిన మెడికల్‌ ఆక్సిజన్‌ను అందించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా పాటించకపోవడం పట్ల న్యాయస్థానం అధికారులపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ సమయంలో కోర్టు ధిక్కరణ చర్యలకు ఎందుకు ఉపక్రమించకూడదని ప్రశ్నిస్తూ.. కేంద్రానికి షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

దిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. అక్కడి ఆసుపత్రులను మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వీటికి సంబంధించిన కేసులను విచారిస్తోన్న దిల్లీ హైకోర్టు.. కేంద్రం కేటాయించిన ఆక్సిజన్‌ ఒక్కరోజు కూడా రాష్ట్రానికి అందలేదనే విషయం న్యాయస్థానం దృష్టికి వచ్చిందని పేర్కొంది. అలాంటప్పుడు అఫిడవిట్‌లు దాఖలు చేసి ప్రయోజనమేంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా దిల్లీలో ఆక్సిజన్‌ సంక్షోభం కొనసాగుతుండడం పట్ల కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసిన దిల్లీ హైకోర్టు, ఆక్సిజన్‌ సరఫరా చేయడంలో మీకంటే ఐఐటీ, ఐఐఎంలే మెరుగుగా పనిచేస్తాయని అభిప్రాయపడింది.

దిల్లీలో ఆక్సిజన్‌ సరఫరాపై తీసుకుంటున్న చర్యలను కేంద్రప్రభుత్వం ఓ నివేదిక రూపంలో దిల్లీ హైకోర్టు ముందుంచింది. అయితే, నివేదికల ప్రకారం సరిపడ ఆక్సిజన్‌ ఉన్నప్పటికీ సరఫరాలో లోపం ఉన్నట్లు కోర్టు గుర్తించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కోర్టు.. ధిక్కరణ చర్యలకు ఎందుకు ఉపక్రమించకూడదంటూ షోకాజు నోటీసు జారీచేసింది. అంతేకాకుండా దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర వద్ద ఉన్న ప్రణాళికను తెలియజేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని