Vaccine: యువతను వదిలేసి వృద్ధులకు టీకాలా?

కరోనా రెండో దశలో ఎక్కువగా యువతరమే ప్రాణాలు కోల్పోతోందని.. భవిష్యత్తే వారైనప్పుడు మొదట యువతకే వ్యాక్సిన్‌ ఇవ్వాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. యువతను వదిలిపెట్టి వృద్ధులకు వ్యాక్సినేషన్‌ చేపట్టడంపై ధర్మాసనంలో సభ్యులైన జస్టిస్‌ సంఘీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 03 Jun 2021 01:15 IST

వ్యాక్సినేషన్‌పై దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

దిల్లీ: కరోనా రెండో దశలో ఎక్కువగా యువతరమే ప్రాణాలు కోల్పోతోందని.. భవిష్యత్తే వారైనప్పుడు మొదట యువతకే వ్యాక్సిన్‌ ఇవ్వాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. యువతను వదిలిపెట్టి వృద్ధులకు వ్యాక్సినేషన్‌ చేపట్టడంపై ధర్మాసనంలో సభ్యులైన జస్టిస్‌ సంఘీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దిల్లీలో కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై జస్టిస్‌ సంఘీ వ్యక్తిగతంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఈ విపత్కర పరిస్థితుల్లో మన భవిష్యత్తుకు.. అంటే యువతకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకోసం యువతకు మొదట వ్యాక్సినేషన్‌ చేయాలి. కానీ, జీవితాన్ని చూసేసిన 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చి వారికి వ్యాక్సిన్‌ వేస్తున్నాం. అలా అని వృద్ధుల జీవితాలు ముఖ్యం కాదని అనట్లేదు. కరోనా రెండో దశలో యువతరమే ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటోంది. అనేక మంది యువతీయువకులు కరోనాకు బలవుతున్నారు. కాబట్టి వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, అలా జరగట్లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యాక్సిన్‌ పాలసీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. దేశంలో ప్రజలందరినీ కాపాడాల్సిన అవసరం ఉంది.  రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే యువతనే కాపాడాలి. అందులో తప్పేమి లేదు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇటలీలో అదే చేస్తున్నారు. వృద్ధులకు ఆస్పత్రుల్లో పడకలు లేవని తేల్చి చెబుతున్నారు’’ అని జస్టిస్‌ సంఘీ అన్నారు.

వ్యాక్సిన్లు లేనప్పుడు ఎందుకు ప్రకటించారు?

యువతకు వ్యాక్సిన్‌ ప్రకటనపై జస్టిస్‌ సంఘీ స్పందిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘ఇటీవల 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్‌ చేపడతామని ప్రకటించారు. ఇప్పుడేమో వ్యాక్సిన్లు లేవని ఆ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నారు. అలాంటప్పుడు యువతకు వ్యాక్సిన్‌ వేస్తామని ఎందుకు ప్రకటించారు? మనం భవిష్యత్తు(యువత)పై పెట్టుబడి పెట్టాలి. కానీ దాన్నే పక్కన పెట్టేస్తున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని జస్టిస్‌ సంఘీ స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని