Delhi Services Act: ‘దిల్లీ బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం.. ఇక చట్టంగా..

దేశ రాజధాని దిల్లీలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సర్వీసుల చట్టం అమల్లోకి వచ్చింది. విపక్షాల ఆందోళనల మధ్యే పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈ వివాదాస్పద బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

Updated : 12 Aug 2023 12:34 IST

దిల్లీ: అత్యంత వివాదాస్పదమైన ‘దిల్లీ సర్వీసుల బిల్లు’ (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023) ఇక చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో ఇక దిల్లీ సర్వీసుల చట్టం (Delhi Services Act)గా అమల్లోకి వచ్చింది.

దేశ రాజధాని దిల్లీలో ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజే దిల్లీలో అధికారుల బదిలీలపై కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. గ్రూప్‌ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది.  కమిటీకి దిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. 

ఇందులో సీఎం మినహా మిగిలిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌ స్పష్టం చేసింది. ఒకవేళ వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఎల్జీదే తుది నిర్ణయమని పేర్కొంది. అంటే.. అధికారమంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. దీంతో ఈ ఆర్డినెన్స్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.

ఐపీసీకి చెల్లుచీటీ

ఈ క్రమంలోనే ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో చట్టం తీసుకొచ్చేలా.. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ‘దిల్లీ సర్వీసుల బిల్లు (Delhi Services)’ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును విపక్ష కూటమి ‘ఇండియా’ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజాగా రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది.

అమల్లోకి డేటా ప్రొటెక్షన్‌ చట్టం..

దిల్లీ సర్వీసుల బిల్లుతో పాటు డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్‌ విశ్వాస్‌ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇవి కూడా చట్టంగా మారాయి. దేశ పౌరుల డిజిటల్‌ హక్కుల (Digital Rights)ను బలోపేతం చేయడంతో పాటు వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు డేటా ప్రొటెక్షన్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఇకపై డిజిటల్‌ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా.. సమాచార దుర్వినియోగానికి పాల్పడినా సదరు కంపెనీలపై కనిష్ఠంగా రూ.50కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించాలనే నిబంధనను తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని