MLAs Salary: ఎమ్మెల్యేల జీతాలు ఏయే రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎమ్మెల్యేల జీతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణలు ముందువరసలో ఉన్నాయి.

Published : 05 Jul 2022 17:16 IST

దిల్లీ: శాసనసభ సభ్యుల (MLAs) జీతాలు పెంచేందుకు దిల్లీ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన ఐదు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం వెంటనే వారి జీతాల్లో 66శాతం పెరుగుదల కనిపించనుంది. ప్రస్తుత జీతం రూ.12వేలు కాగా తాజా పెంపుతో అది రూ.30వేలు కానుంది. ప్రస్తుతం దిల్లీ ఎమ్మెల్యేలకు జీతభత్యాలు మొత్తం కలిపి నెలకు రూ.54వేలు వస్తుండగా అది రూ.90వేలకు చేరనుంది. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దిల్లీ చట్టసభ సభ్యుల జీతం తక్కువేనని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్‌ఎస్‌ (PRS Legislative) గణాంకాల ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో చట్టసభ సభ్యుల జీతభత్యాల్లో తేడాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎమ్మెల్యేల జీతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణ ముందువరసలో ఉన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ ఎమ్మెల్యేల జీతం అత్యధికంగా రూ.55వేలు. వీటికి అదనంగా నియోజకవర్గం ఖర్చులు 90వేలు, రోజువారీ భత్యం రూ.1800, సెక్రటేరియట్‌ అలవెన్స్‌ రూ.30వేలు, టెలిఫోన్‌ బిల్లులు రూ.15వేలు చెల్లిస్తున్నారు. ఇలా మొత్తంగా నెలకు లక్షా 90వేలు దాటుతుంది. కాగా తెలంగాణలో ఎమ్మెల్యేల నెల జీతం రూ.20వేలు. అయినప్పటికీ నియోజకవర్గం భత్యం మాత్రం అత్యధికంగా రూ. 2.3లక్షలుగా ఉంది.

కేరళలో తక్కువే..

దిల్లీ ఎమ్మెల్యేలతో పోలిస్తే ప్రస్తుతం కేరళ చట్టసభ సభ్యుల జీతం రూ.2వేలు తక్కువ. ఇక వారికి సెక్రటేరియల్‌ అలవెన్సులు ఏమీ లేవు. నియోజకవర్గం భత్యం మాత్రం రూ.25వేలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల జీతం రూ.12వేలు. వారి నియోజకవర్గ అలవెన్సు మాత్రం రూ.1.13లక్షలు.

ఇతర రాష్ట్రాల్లో చూస్తే..

తమిళనాడులో ఎమ్మెల్యేల జీతం రూ.30వేలు కాగా నియోజకవర్గం భత్యం రూ.25వేలు.

ఉత్తరాఖండ్‌ ఎమ్మెల్యేలు రూ.20వేలు జీతంగా తీసుకుంటుండగా వారి నియోజకవర్గం ఖర్చులు రూ.1.5లక్షలు. ఇతర అలవెన్సులతో కలిపి మొత్తంగా వారికి రూ.1.82లక్షలు అందుతుంది.

పంజాబ్‌లో ఎమ్మెల్యేల జీతభత్యాలు కలిసి నెలకు రూ.95వేలు అందుకుంటారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యేల జీతం రూ.25వేలు. నియోజకవర్గ భత్యం రూ.30వేలు. ఆర్డర్లీ, మెడికల్‌ అలవెన్సుల పేరుతో మరో రూ.55వేలు అందుతుంది.

మిజోరాం ఎమ్మెల్యేల జీతం రూ.80వేలు కాగా నియోజకవర్గం భత్యం రూ.40వేలుగా ఉంది. ఇతర అలవెన్సులు కలిపి వీరికి మొత్తం రూ.1.50లక్షలు జీతభత్యాల రూపంలో వస్తాయి.

పశ్చిమబెంగాల్‌ ఎమ్మెల్యేల జీతం రూ.21వేలు. రోజువారీ భత్యం (రోజుకు రూ.2వేలు) కలిపి నెలకు రూ.81వేలకుపైగా వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని