Madhya Pradesh: నీటి పొదుపు గురించి ఇలా కూడా చెబుతారా?

నీటిని పొదుపు చేసేందుకు ఏం చేయాలో చెబుతూ భాజపా ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఎంపీ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతకీ ఎంపీ ఏం చెప్పారంటే?

Updated : 08 Nov 2022 20:21 IST

భోపాల్‌: ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో నీరు ఎంతో ముఖ్యమైంది. తరాలు మారినా, మనిషి జీవనశైలిలో మార్పులు జరిగినా.. నీరు లేనిదే భూమిపై జీవరాశుల మనుగడ అసాధ్యం. అంతటి ప్రాముఖ్యం ఉంది కాబట్టే.. భవిష్యత్తు తరాల కోసం నీటి ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇదే విషయాన్ని అప్పుడప్పుడు వక్తలు, రాజకీయనాయకులు తమ ప్రసంగాల్లో చెబుతుంటారు. తాజాగా, నీటి ప్రాముఖ్యత గురించి చెప్పే క్రమంలో భాజపా ఎంపీ జనార్దన్‌ మిశ్రా చెప్పిన మాటలు వివాదాస్పదమయ్యాయి.

మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన నీటి సంరక్షణపై జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి నీటి ప్రాధాన్యతను వివరిస్తూ.. ‘‘నీరులేక భూములు ఎండిపోతున్నాయి. నీటిని మనం ఆదా చేయాలి. బోర్‌వెల్స్‌లో భూగర్భజలాలను తోడేస్తున్నారు. మీరు మద్యం సేవించండి, పొగాకు తినండి, గంజా తాగండి.. కానీ, నీటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి’’ అని చెప్పారు. డబ్బును మీకు నచ్చినట్లు ఖర్చుపెట్టండి. నీటిని ఆదా చేసేందుకు కూడా కొంత మొత్తాన్ని వెచ్చించండి అంటూ ఎంపీ వ్యాఖ్యానించారు. ‘‘చెడు అలవాట్లను మానేయమని కోరితే నా మాట ఎవరు వినరు. కాబట్టే, వారికి ఈ విధంగా చెప్పాను’’ అని ఎంపీ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. జనార్థన్‌ మిశ్రా వ్యాఖ్యలు చేస్తున్న వీడియో వైరల్‌ కావడంతో విపక్షాలు ఆయనపై మండిపడుతున్నాయి.

గతంలో కూడా మిశ్రా తన చర్యలతో వార్తల్లో నిలిచారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవా నియోజకవర్గంలోని ఓ పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను ఎంపీ ఖాళీ చేతులతో క్లీన్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అప్పట్లో వైరల్‌గా మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని