ED, CBI: ప్రభుత్వాలను కూల్చడంలో భాగస్వామ్యం కావద్దు!

ప్రభుత్వాలను పడగొట్టడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED), సీబీఐ (CBI) వంటి కేంద్ర సంస్థలు భాగస్వామ్యం కావద్దని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

Published : 03 Jul 2021 01:16 IST

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

ముంబయి: ప్రభుత్వాలను పడగొట్టడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED), సీబీఐ (CBI) వంటి కేంద్ర సంస్థలు భాగస్వామ్యం కావద్దని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా మహా వికాస్‌ అఘాడీ (MVA) ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నేతలను కేంద్ర సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు చెందిన చక్కెర మిల్లుకు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ ఈ విధంగా స్పందించారు.

కేంద్ర సంస్థల ద్వారా ఈ తరహా దాడులు మరిన్ని జరుగుతాయనే సంకేతాలను ఇస్తున్నారని.. ఇలాంటి రాజకీయాలు మంచివి కావని సంజయ్‌ రౌత్‌ అభిప్రాయపడ్డారు. చక్కెర మిల్లులపై లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయన్నారు. వెనుక నుంచి దాడులు చేసేందుకు ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను కొందరు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వాలను కూల్చడంలో ఈడీ, సీబీఐలు భాగస్వామ్యం కావద్దని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు చోటుచేసుకోవడంతో పాటు కూటమిని బలహీన పరిచేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందని వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో శివసేన ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

జులై 5, 6వ తేదీల్లో జరగనున్న వర్షాకాల సమావేశాల సందర్భంగా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక జరుగనుంది. ఇదే సమయంలో కీలక నేతలపై ఈడీ దాడులను ముమ్మరం చేసింది. అయితే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ విజయం సాధిస్తుందని శివసేన విశ్వాసం వ్యక్తం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. స్పీకర్‌ పదవి కాంగ్రెస్‌కే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని