Odisha Train Accident: ప్రభుత్వ పరిహారం కోసం.. కొత్త తరహా మోసం!

ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accidnet)లో మృతిచెందిన వారి వివరాలను గుర్తించేందుకు రైల్వే శాఖ, ఒడిశా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ, కొంతమంది దురాశపరులు కొత్త తరహా మోసానికి తెరలేపారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. 

Updated : 06 Jun 2023 16:19 IST

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accidnet)లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటికీ కొంత మందిని గుర్తించలేదు. బాధితుల ఆచూకీ తెలుసుకునేందుకు వీలుగా భారతీయ రైల్వే (Indian Railways) మృతులు, గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, కొంతమంది దురాశపరులు బాధితుల కుటుంబసభ్యులకు కడసారి చూపు దక్కనీయకుండా చేస్తున్నారు. ప్రభుత్వం అందించే పరిహారాన్ని పొందేందుకు నకిలీ ధ్రువపత్రాలతో మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.

ఇప్పటికీ ఎవరు గుర్తించని మృతులను తమ కుటుంబసభ్యులుగా నమ్మించి అధికారుల నుంచి మృతదేహాలు తీసుకుంటున్నారు. ఈ నయా మోసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) అప్రమత్తమైంది. ప్రభుత్వ పరిహారం పొందేందుకు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒడిశా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ జెనా.. రైల్వే అధికారులు, ఒడిశా పోలీసులను కోరారు. 

మోసం బయటపడిందిలా..

కటక్‌కు చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ ఆదివారం బాలాసోర్‌లోని మృతుల ఫొటోలను ఉంచిన ప్రదేశానికి వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణించాడని, అతని ఆచూకీ తెలియడంలేదని పోలీసులకు తెలిపింది. దీంతో, అక్కడున్న ఫొటోల్లో తన భర్త ఆచూకీ ఉందేమో చూడాలని పోలీసులు ఆమెకు సూచించారు. కొన్ని ఫొటోలను చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ.. అతడే తన భర్త అని చెప్పింది. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విచారించగా.. ఆమె భర్త బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో గీతాంజలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో అంగీకరించింది.

‘‘మృతుల ఫొటోలను చూసేందుకు వచ్చినప్పుడు ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఎలాంటి భావోద్వేగాలు లేకుండా.. సాధారణంగా మృతులలో ఒక వ్యక్తి ఫొటో చూపించి తన భర్త అని చెప్పింది. ఆమె అందించిన వివరాల ఆధారంగా బారంబా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విచారించగా.. ఆమె భర్త బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. ప్రభుత్వ పరిహారం కోసం ఈ మోసానికి పాల్పడినట్లు అంగీకరించింది’’ అని బాలాసోర్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్చురీ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని