Nitin Gadkari: నేనూ మీ బెంజ్‌ కారు కొనలేను.. గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్య

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్ ఇండియాకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచన చేశారు.

Updated : 01 Oct 2022 13:14 IST

ముంబయి: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్ ఇండియాకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ సూచన చేశారు. భారత్‌లో ఆ సంస్థ ఉత్పత్తిని పెంచాలని కోరారు. దానివల్ల ధర తగ్గుతుందని, ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని చెప్పారు. ధర ఎక్కువగా ఉండటంతో ఈ కారు తాను కూడా కొనలేనని సరదాగా వ్యాఖ్యానించారు. 

శుక్రవారం పుణెలోని చకన్ తయారీ యూనిట్‌లో దేశీయంగా అసెంబుల్ చేసిన EQS 580 4MATIC EVని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘మీరు ఉత్పత్తి పెంచండి. అప్పుడు ధర తగ్గే అవకాశం ఉంటుంది. మేమంతా మధ్యతరగతి వాళ్లం. ఈ కారు నేను కూడా కొనలేను’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సరికొత్త ఈవీ ధర రూ.1.55 కోట్లుగా ఉంది. 

అలాగే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్ద మార్కెట్ ఉందని మంత్రి వెల్లడించారు. దేశంలో 15.7 లక్షల ఈవీలు రిజిస్టర్ అయ్యాయని  చెప్పారు. వీటి విక్రయాలు 335 శాతం పెరిగాయన్నారు. దేశంలో హైవేల నిర్మాణం వేగంగా సాగుతోందని, దానివల్ల బెంజ్ కార్లకు మంచి మార్కెట్ ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని